మోడీ మీటింగ్‌కు కోట్లలో ఖర్చు

మోడీ మీటింగ్‌కు కోట్లలో ఖర్చు

రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా భావించే వివిధ బీజేపీ పాలిత రాష్ర్టాల ఎన్నిక‌ల్లో గెలుపుకోసం క‌మ‌ల‌నాథుల సార‌థి, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ముంద‌స్తుగానే వ్యూహాలు ర‌చిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయా రాష్ర్టాల్లో ప‌ర్య‌ట‌న‌ల షెడ్యూల్ ఖ‌రారు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అయితే, ఇలా ఆయ‌న షెడ్యూల్‌కు సంబంధించి తాజా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మోడీ టూర్‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఏకంగా రూ.7.23 కోట్లు ఖ‌ర్చు అవుతోంది. అయితే, ఇది పార్టీ క‌ఱ్చు కాదు... ప్ర‌భుత్వ ఖ‌ర్చు.

ఔను...జైపూర్‌లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక రోజు పర్యటనకు ఈ మొత్తం ఖ‌ర్చు కానుంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోడీ పాల్గొనే సభకు జనాన్ని సమీకరించడం కోసం రాజస్థాన్‌ ప్రభుత్వం రూ. 7.23 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి మీడియాకు చిక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం కేవలం జనాన్ని తరలించడం కోసం ఖర్చుచేస్తున్నదైతే.. ఆహారం, వసతి ఏర్పాట్లు, ఇతరత్రా ఖర్చులకు భారీ మొత్తంలో ఖర్చుచేయనున్నట్టు అంచ‌నా వేస్తున్నారు.

అనధికారిక సమాచారం ప్రకారం... ఈ మొత్తం రూ.10 కోట్లు దాట‌వ‌చ్చంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని స్మార్ట్‌సిటీ కార్యక్రమం పేరిట ఓ ర్యాలీని కూడా ప్రారంభించనున్నారు.  కాగా, వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్దిపొందిన వారిని దాదాపు రెండున్నర లక్షల మందిని ప్రధాని సభకు తరలిస్తున్నారు.  ఆ రెండున్నర లక్షల మందికి రవాణా సౌకర్యంతోపాటు, వసతి, ఆహారం ఇతర అన్ని సౌకర్యాలను శుక్రవారం నుంచి ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జైపూర్‌కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5,579 బస్సులను ఏర్పాటుచేసింది.

ఇదిలాఉండ‌గా...మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చోటు చేసుకుంది. ఓ మ‌హిళ ప్ర‌ధాన‌మంత్రితో మాట్లాడేందుకు నిరాక‌రించింది. ప్రధానితో మాట్లాడేందుకు భరత్‌పుర్‌ జిల్లా యంత్రాంగం ఐదుగురు మహిళా లబ్దిదారులను ఎంపికచేసింది. మోడీతో అనుకూలంగా ఎలా మాట్లాడాలో వారికి తర్ఫీదును కూడా ఇస్తున్నారు. ఎంపిక చేసిన ఐదుగురిలో మంజూదేవి ఒకరు. కాగా, మంజూదేవి ప్రధానితో మాట్లాడే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించారు.

'కూతురు పుట్టినందుకు నాకు రాజ్‌ శ్రీ పథకం కింద రూ. 5 వేలను రెండు విడతలుగా ఇచ్చారు. మోడీకి అనుకూలంగా మాత్రమే సమాధానం ఇవ్వాలనీ, ఎలాంటి ప్రశ్నలూ వేయవద్దని నాకు చెప్పారు. ఈ పథకం కింద రూ. 50 వేలు ఇస్తామన్నారు. కానీ, రూ. ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రూ. 50 వేలు తీసుకున్నట్టు చెప్పమంటే.. నేను ఎందుకు ఒప్పుకుంటాను. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించాను' అని మంజూదేవి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English