ప్రకాశ్ రాజ్‌కు ఏమైంది..?

ప్రకాశ్ రాజ్‌కు ఏమైంది..?

రాజకీయాలు తెలుసంటారు.. బీజేపీ, మోదీలపై నిత్యం విమర్శలు చేస్తుంటారు.. తాను ఎన్నికల్లో పోటీ చేయనంటారు.. తాను పోటీ చేసినా రాజకీయాలను సమాజాన్ని మార్చలేనని నిస్సహాయత వ్యక్తం చేస్తుంటారు.. ఇదీ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వైఖరి. అప్పుడప్పుడు గొప్పగొప్ప పుస్తకాల్లోని మాటలను చెప్పి మేధావినని అనిపించుకునే ప్రయత్నం చేస్తుంటారు.. ప్రభుత్వాలను ప్రశ్నించి సమాజంపై తనకు కన్సర్న్ ఉన్నట్లు చూపించుకుంటుంటారు. సమావేశాల్లో మాట్లాడుతుంటారు.. తననేం చేసినా భయపడనంటారు.. తానేమీ స్వయంగా చేయడానికి మాత్రం ముందుకురారు. ఏదో చేసేయాలని లోలోన ఉన్నా ఏం చేయడానికీ ధైర్యం చాలని తత్వంగల మనిషిలా ప్రకాశ్ కనిపిస్తుంటారు. గత రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తూ అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు చేస్తుండే ప్రకాశ్ తాజాగా తమిళనాడు రాజకీయాలపై విరుచుకుపడ్డారు.    

తమిళ రాజకీయాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారాయని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా మారిపోయారని అన్నారు. తాను పార్టీతో పోరాడటం లేదని, ప్రభుత్వంతో పోరాడుతున్నానని చెప్పారు. రాజకీయ నాయకులు తమిళనాడును అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో నదులు, పొలాలు, అమాయకులైన ప్రజలు ఉన్నారు. రండి బాబూ రండి" అంటూ అయినకాడికి అమ్మేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే కాకుండా... అన్ని పార్టీలదీ ఇదే దారి అంటూ విమర్శించారు. జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడం తప్ప... తమకు మరొక మార్గం లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు.

తమిళనాడులో అన్నాడీఎంకే కానీ, కేంద్రంలో ప్రధాని మోదీ కానీ ప్రజాపక్షం వహించడం లేదని దుయ్యబట్టారు. పార్టీలన్నింటికీ వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ప్రజాఉద్యమం వస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో అన్నాడీఎంకే ఉండదనే వాస్తవం  ప్రమాదకరంగా మారబోతోందని తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని... అయితే, ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడిగా మాత్రం కాదని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రం ఏదీ మారిపోదని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు