బాబు బ్ర‌హ్మాస్త్రం!... క‌ల‌మ‌నాథుల‌ను దులిపేస్తున్నారు!

బాబు బ్ర‌హ్మాస్త్రం!... క‌ల‌మ‌నాథుల‌ను దులిపేస్తున్నారు!

ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు రాష్ట్రం ఆర్థికంగా కోలుకునేదాకా అండ‌గా నిల‌బ‌డ‌తామంటూ ఎన్నిక‌ల నాడు చెప్పిన బీజేపీ... ఎన్నిక‌లు ముగియ‌గానే త‌న అస‌లు బుద్ధిని చూపెట్టింద‌నే చెప్పాలి. అయితే ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగిన బీజేపీ ఏపీ అభివృద్ధికి ఏమాత్రం స‌హ‌క‌రించ‌కున్నా... రేపైనా, ఎల్లుండైనా స‌హ‌క‌రించ‌క‌పోతుందా? అన్న భావ‌న‌తో  టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స‌హ‌నంతోనే ఆ పార్టీతో చెలిమి చేశారు.

అయితే మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో బీజేపీ అస‌లు స్వ‌రూపం  బ‌య‌ట‌ప‌డ‌గానే ఆ పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై ప్ర‌త్య‌క్ష యుద్ధాన్ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... కేంద్రంతో ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధ‌మేన‌న్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ,  టీడీపీల మ‌ధ్య ఇప్పుడు మాట‌ల యుద్ధ తారాస్థాయికి చేరింద‌నే చెప్పాలి.

ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ఉన్న స‌మ‌యంలోనూ సోము వీర్రాజు లాంటి కొంద‌రు నేత‌లు త‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టినా ఓర్పుతోనే ముందుకు సాగిన చంద్ర‌బాబు... ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన వైఖ‌రి  కొన‌సాగిస్తున్నారు. బీజేపీ  నేత‌లు త‌న‌పైనా, త‌న పార్టీ ప్ర‌భుత్వంపైనా చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లిచ్చేందుకు బాబు ఓ బ్ర‌హ్మాస్త్రాన్ని రంగంలోకి దించేశారు. ఆ బ్ర‌హ్మాస్త్ర‌మే... ఏపీ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావు.

గ‌ణాంకాలు, ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌పై మంచి ప‌ట్టు ఉన్న కార‌ణంగానే కుటుంబరావుకు ఈ కీల‌క ప‌దవిని అప్ప‌గించిన చంద్ర‌బాబు... ఇప్పుడు ఆయ‌న‌కు క‌మ‌ల‌నాథుల విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లిచ్చే కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. దీంతో రంగంలోకి దిగేసిన కుటుంబ‌రావు... బీజేపీ నేత‌లు సంధిస్తున్న విమ‌ర్శ‌ల‌పై త‌న‌దైన శైలి కౌంట‌ర్లిస్తూ... క‌మ‌లనాథుల నోట మాట రాకుండా చేస్తున్నారు. మొన్న‌టిదాకా చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌ల  విష‌యంలో కాస్తంత దూకుడు ప్ర‌ద‌ర్శించిన బీజేపీ  నేత‌లు... కుటుంబ‌రావు రంగంలోకి దిగ‌గానే తీవ్ర అయోమ‌యానికి గుర‌వుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అంతేకాకుండా ఇప్పుడు కొత్త‌గా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా చంద్ర‌బాబుపై దూకుడుగా వెళ్లాల‌ని చూసిన ప్ర‌తిసారి... అటువైపు నుంచి కుటుంబ‌రావే క‌నిపిస్తున్నార‌ట‌. ఇప్ప‌టిదాకా బీజేపీ నేత‌లు జీవీఎల్ న‌ర‌సింహారావు, సొము వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి, చివ‌ర‌కు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేసిన ఆరోప‌ణ‌ల‌కు వ‌రుస కౌంట‌ర్ల‌ను ఇచ్చేసిన కుటుంబరావు... ఇప్పుడు ఏకంగా క‌న్నా, సోముల‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల‌కు వారిద్ద‌రి నుంచి రిప్లై ఇవ్వ‌ని ప‌క్షంలో  ఏకంగా ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

ఈ విష‌యంపై కాసేప‌టి  క్రితం మీడియాతో మాట్లాడిన కుటుంబ‌రావు... బీజేపీ నేత‌ల‌కు వ‌రుస ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. ప్రత్యేక ప్యాకేజీ తాము అడగలేదని, అందులో 90:10 నిష్పత్తిలో నిధులు అడిగినట్లు ఎక్కడుందో బీజేపీ నేతలు చెప్పాలని ఆయ‌న ప్ర‌శ్నించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇప్పటి వరకు రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చారని, కానీ రూ.1800 కోట్లు ఇచ్చినట్లు బీజేపీ నేత‌లు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. సాగరమాల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. ఏపీకి ఇచ్చింది రూ.82 కోట్లు మాత్రమేనని తెలిపారు.

రూ.12 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ప్రత్యేక ప్యాకేజీ కంటే ముందే ఇచ్చినవని, రూ.17 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు అదనపు ప్రాజెక్టుల ప్రతిపాదనలని వివరించారు. ఈ  సంద‌ర్భంగా బీజేపీపై త‌న‌దైన సెటైర్లు  వేసిన కుటుంబ‌రావు... బీజేపీ  ఓ జుమ్లా పార్టీ, జోకర్స్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. మొత్తంగా కుటుంబ‌రావు  రూపంలో బాబు సంధించిన బ్ర‌హ్మాస్త్రంతో క‌మ‌ల‌నాథులు తీవ్ర అయోమ‌యంలో ప‌డ్డార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు