రాంగ్ టార్గెట్లను ఎంచుకుంటున్న పవన్

రాంగ్ టార్గెట్లను ఎంచుకుంటున్న పవన్

రాజకీయమంటే గుడ్డెద్దు చేలో పడినట్లు కాదు.. ప్రత్యర్థి పార్టీల నేతలందరినీ ఒకేలా చూడడం కాదు.. ఎవరిని విమర్శించాలో, ఎవరిని విమర్శించకోడదూ తెలిసి ఉండడమూ రాజకీయంలో భాగమే. ఒక్క మాటతో ఎన్నడు లేనంత మైలేజి రావొచ్చు.. అదే ఒక్క మాటతో ఎన్నో ఏళ్లుగా సాధించుకున్న ఇమేజంతా పోగొట్టుకోవచ్చు. రాజకీయాల్లో కాకలు తీరిన వారందరికీ ఇది అనుభవమే.

కానీ... సమస్యంతా సడెన్ స్టార్లతోనే. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన ఉత్తరాంధ్ర పర్యటనలో రాంగ్ టార్గెట్లను ఎంచుకుని దెబ్బయ్యారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై అర్థంపర్థం లేని విమర్శలు చేయడం.. తనవల్లే ఆయన గెలిచారని చెన్పడంతో జనం పవన్‌ తీరును వ్యతిరేకించారు. అశోక్‌కు సొంత జిల్లా విజయనగరంలోనే కాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది.. ఆయన ఆస్తిపాస్తులు.. ఆ కుటుంబ దానగుణం.. అశోక్ నీతినిజాయితీలు, వారు కనిపిస్తే చాలు ఓట్లు పడతాయన్న సత్యం అన్నీ ఉత్తరాంధ్ర ప్రజలకు తెలిసినవే. అలాంటి అశోక్‌పై పవన్ విమర్శలు చేయడాన్ని చూసి టీడీపీ నేతలే కాదు.. ఇతర పార్టీల నేతలు కూడా ఆశ్చర్యపోయారు. జనమైతే... పవనేంటి అశోక‌్‌ను గెలిపించడమేంటి అనుకున్నారు.

తాజాగా మాజీ ఎంపీ సబ్బం హరి కూడా పవన్ తీరును తప్పు పట్టారు. అంతేకాదు... ఆయన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలో ఆయన పట్ల వ్యతిరేకతను పెంచాయని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తన వల్లే గెలిచారని పవన్ కల్యాణ్ అన్నందునే పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏర్పడిందని సబ్బం అన్నారు.  ‘అశోక్ గజపతిరాజు అనుభవిస్తున్న వన్నీ పవన్ దయ వల్లే అన్నట్టు ఆయన మాట్లాడారు. అలా మాట్లాడినందుకు పవన్ పట్ల ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1983 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజు గెలుస్తూ వస్తున్నారు. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? టీడీపీలో క్రమశిక్షణ గల సీనియర్ నేత అశోక్ గజపతిరాజు’ అని అన్నారు.

‘‘వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని సబ్బం అభిప్రాయపడ్డారు. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనం. టీడీపీ, చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.  రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయాలు నడిపిందో, ఈరోజున ఏపీలో బీజేపీ అలాంటి రాజకీయ క్రీడ నడపబోతోందనే విషయం రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా అర్థమవుతుందన్నారు.

'జగన్-పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబునాయుడి గెలుపు నల్లేరు మీద నడకే. కచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది. కానీ, వైసీపీ-జనసేన కలిసి పోటీచేస్తే కొత్త వ్యూహాలకు టీడీపీ వెళ్లాల్సిన అవసరముంది. ఆ వ్యూహాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తాను ఏ పార్టీలో చేరే విషయం ఎన్నికల నాటికి చెబుతానని అన్నారు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని, టీడీపీలో చేరాలంటూ చంద్రబాబు రెండుసార్లు తనను ఆహ్వానించారని, అయినా తాను ఆ పార్టీలోకి వెళ్లలేదని అన్నారు. అదేవిధంగా బీజేపీలో చేరమని వెంకయ్యనాయుడు కూడా తనను అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

కాగా... కొన్నాళ్లుగా సబ్బం హరి వైఖరి.. వైసీపీ పట్ల ఆయనలో ఇంకా ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం.. బీజేపీపై జనంలో కోపం ఉండడం.. పవన్ కల్యాణ్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు