ఈ `రివేంజ్` రాజ‌కీయాలేంది ప‌వ‌న్?

ఈ `రివేంజ్` రాజ‌కీయాలేంది ప‌వ‌న్?

40 ఏళ్ల  అపార అనుభ‌మున్న చంద్ర‌బాబును సీఎంను చేస్తేనే న‌వ్యాంధ్రప్ర‌దేశ్ అభివృద్ధి చెందుతుంద‌ని, అందుకే ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు మార్లు నొక్కివ‌క్కాణించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం టీడీపీతో మిత్ర‌బంధాన్ని తెంచుకున్న ప‌న‌వ్....చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లూ చంద్ర‌బాబును పొగిడిన ప‌వ‌న్ హ‌ఠాత్తుగా యూట‌ర్న్ తీసుకొని ఆయ‌న‌పై అర్థంప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. తాజాగా, విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్....చంద్ర‌బాబుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. విశాఖపట్నం భూ కుంభకోణంలో టీడీపీ ఎంపీలు, ఎంమ్మెల్యేల‌ పాత్ర ఉందని, అందుకే ఆ ద‌ర్యాప్తు నివేదికను వెల్ల‌డించేందుకు చంద్రబాబు ముందుకు రావ‌డం లేద‌న్నారు. గ‌త నాలుగేళ్ల‌లో చంద్ర‌బాబు ఏపీకి ఏం చేశారో ప్ర‌జ‌లు చూశార‌ని, ఇటువంటి నేప‌థ్యంలో ప్ర‌జ‌లు మ‌రోసారి చంద్రబాబును ముఖ్య‌మంత్రిగా ఎలా ఎన్నుకుంటార‌ని ప్ర‌శ్నించారు. రాబోయే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ముఖ్యమంత్రి కానివ్వ‌బోన‌ని స్పష్టం చేశారు. కేసుల భయంతోనే చంద్రబాబు, జగన్ లు....మోదీని ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు సంగతి చంద్రబాబుకు ముందే తెలుసని, అందుకే హెరిటేజ్ వాటాల‌ను అమ్మార‌ని అన్నారు.


ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల‌న్నీ చూస్తుంటే ప‌వ‌న్ కూడా ఫుల్ టైం ప్రొఫెష‌న‌ల్ పొలిటిషియ‌న్ అయిన‌ట్లు క‌నిపించ‌క మానదు. మొన్న‌టివ‌ర‌కు త‌న‌కు సీఎం ప‌దవిపై ఆస‌క్తి లేద‌న్న ప‌వ‌న్.....ఇపుడు త‌న‌కు ఓట్లు వేసి సీఎం చేయాల‌ని కోర‌డం హాస్యాస్పదం. అదీగాక ప‌వ‌న్ లోని సినీ న‌టుడు తాజాగా మేల్కొన్న‌ట్లు క‌నిపిస్తోంది. సినిమాల్లో హీరోలాగా చంద్ర‌బాబును  సీఎం కాకుండా శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని....ప‌వ‌న్ ప్ర‌తీకార రాజ‌కీయాల‌ను చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కూడా ప‌వ‌న్ ఇదే త‌ర‌హాలో మాట్లాడారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌పుడు కూడా కొంద‌రు వ్య‌క్తులు త‌మ‌ను మోసం చేశార‌ని, వారంద‌రిపై రివేంజ్ తీసుకుంటాన‌ని ప‌వ‌న్ బ‌హిరంగంగానే అన్నారు. అయితే, ఇటువంటి ప్ర‌తీకార స్పీచ్ లు దంచ‌డం వ‌ల్ల ముఖ్య‌మంత్రి కార‌నే విష‌యాన్ని ప‌వ‌న్ మ‌ర‌చిపోతున్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే...ప్రజా సేవ చేయాలి, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని ప‌రిష్క‌రించ‌గ‌ల‌గాలి. అలా కాకుండా త‌న వ్య‌క్తిగ‌త‌, కుటుంబ ప్ర‌యోజ‌నాల కోసం....చంద్ర‌బాబును సీఎం కానివ్వ‌ను...అంటూ ప్ర‌తీకార ధోర‌ణిలో మాట్లాడడం...ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన‌ట్లు కాదా? ఇదంతా చూస్తుంటే....త‌న‌ను, త‌న సోద‌రుడిని, కుటుంబాన్ని ఇబ్బందుల పాలుజేసిన వారిపై రివేంజ్ తీసుకునేందుకే ప‌వ‌న్ పార్టీ పెట్టిన‌ట్లు అనిపిస్తోంది. భ‌విష్య‌త్తులో జ‌న‌సేనాని నుంచి మ‌రెన్ని సినిమా డైలాగులు వినాల్సి వ‌స్తుందో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు