ముందస్తుకు రెడీ అవుతున్న కేసీఆర్

ముందస్తుకు రెడీ అవుతున్న కేసీఆర్

తెలంగాణ సీఎం, టీఆరెస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు 15 తరువాత మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేస్తారని తెలుస్తోంది.  ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌దే ఏకపక్ష విజయం అని సర్వేలు వెల్లడిస్తుండడంతో ఇనుము వేడిగా ఉన్నప్పుడే సుత్తి దెబ్బ పడాలన్న సూత్రంతో కేసీఆర్ ముందస్తుకు సిద్ధమవుతున్నట్లు టాక్. అధినేత దూకుడుకు తగ్గట్లుగానే నేతలు కూడా ఎన్నికలకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్‌ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించగా ఇందులో మెరుగ్గా ఉన్న నేతలకు పరిస్థితులను బట్టి అభ్యర్ధిత్వాలపై స్పష్టతనిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్ధి పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంటే తర్వాత అభ్యర్ధిగా ఎవరైతే బాగుంటుందన్న అంశాలపై సర్వేలు జరుగుతున్నాయి. పార్టీ విజయావకాశాలపై పార్టీ ఆవిర్భావం నుండి సర్వే నిర్వహిస్తున్న ఏజెన్సీతో పాటు మరికొన్ని ఏజెన్సీల ద్వారా మార్చిమార్చి సర్వేలు నిర్వహించినా టీఆర్ఎస్‌దే అధికారం అన్న ఫలితాలు రావడంతో నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

కాగా ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిగ్నల్ ఇచ్చారని టీఆరెస్ నేతలు అంటున్నారు.  తెలంగాణ ప్రజలు విజయానికి సంకేతంగా భావించే పాలపిట్ట సెంటిమెంట్‌ను కేసీఆర్ పాటించారని. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బహుకరించిన ముక్కుపుడకలో పాలపిట్ట ఆకృతిని ఉంచడం ద్వారా సీఎం విజయ సాధనకు అమ్మవారి ఆశీర్వాదం పొందారని అంటున్నారు.

మరోవైపు ఇటీవల గద్వాల సభలోనూ మళ్ళీ దీవించండి అంటూ కేసీఆర్ పిలుపునివ్వడం ఎన్నికలు సమీపిస్తున్నాయనడానికి నిదర్శనమని అంటున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేసుకోమని ఎమ్మెల్యేలకు సంకేతాలిచ్చింది. సీఎం సంకేతాలతో ఎమ్మెల్యేలు ఫైళ్ళు పట్టుకుని హైదరాబాద్‌ పరుగుతీస్తుండగా, జాప్యం జరుగుతున్న పనులపూర్తికి అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కీలకమైన టికెట్ల కేటాయింపు అంశాలపైనా సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. మరోవైపు టీఆర్ఎస్‌లోకి నేతల వలసలు వెల్లువెత్తుతుండడం, ముఖ్యుల చేరికలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు