జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఏం చేస్తోంది?

జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఏం చేస్తోంది?

జమ్ముకాశ్మీర్‌లో బీజేపీ చక్రం తిప్పుతోంది. అక్కడ పీడీపీతో తెగతెంపులు చేసుకున్న తరువాత కొద్దిరోజులుగా శాసనసభ సుప్తచేతనావస్థలో ఉంది. దీంతో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండగా బీజేపీ ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పీడీపీని చీల్చుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిన్నమొన్నటిదాకా భాగస్యామ్య పక్షంగా వ్యవహరించిన బీజేపీ, ఇప్పుడు పీడీపీలోని అసంతృప్త శాసనసభ్యులు, ఇతర పార్టీల్లోని మరి కొందరి సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ప్రయత్నిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మూడేళ్ల క్రితం ఎవరూ ఊహించని రీతిలో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర వహించిన పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సజ్జాద్‌ ఘనీలోన్‌, మాజీ ఆర్థికమంత్రి హసీద్‌ ద్రబూ, పీడీపీ అసంతృప్త నేత, మాజీ క్రీడలశాఖ మంత్రి ఇమ్రాన్‌ రెజా అన్సారీ ఇప్పుడు బీజీపే సారథ్యంలో కొత్త సంకీర్ణ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సజ్జాద్‌లోన్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రామ్‌మాధవ్‌ గతవారం భేటీ అయిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. పీడీపీ నుంచి దాదాపు 11మంది బయటకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పలువురు పీడీపీ శాసనసభ్యులు అధినేత మెహబూబా ముఫ్తీపై విమర్శలు గుప్పిస్తుండడంతో వారూ గోడ దూకొచ్చని టాక్.

కాగా జమ్ముకశ్మీర్ లో ప్రతిష్టంబన ఏర్పడడంతో తామూ అవకాశాలు వెతుక్కోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పీడీపీతో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై నేతలు చర్చిస్తున్నారు.  87 మంది శాసన సభ్యులున్న జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు 44మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ)కి 28, బీజీపీకి 25, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 మంది శాసనసభ్యులున్నారు. సజ్జాద్‌ ఘనీలోన్‌ సారధ్యంలోని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌కు 2, జేకేఎల్ఎఫ్‌, సీపీఎం పార్టీల తరపున ఒక్కొక్కరు, ముగ్గరు ఇండిపెండెంట్‌లు ఉన్నారు. కాగా పీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు జతగడితే వాటి బలం 40కు చేరుతంది. మరో నలుగురి మద్దతు లభిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.మరోవైపు పీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలోని అసంతృప్త నేతలు, ఇండిపెండెట్ల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విస్తృత ప్రయత్నాలు సాగుతున్నాయి. సజ్జాద్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు