రాయల నాటి కథ.. సెట్టవుతాడా?

రాయల నాటి కథ.. సెట్టవుతాడా?

ఒకప్పుడు పీరియాడిక్.. జానపద చిత్రాలంటే నిర్మాతలు భయపడిపోయేవాళ్లు. ఆ బడ్జెట్లు.. ఆ భారీతనం మన వల్ల కాదని వెనక్కి తగ్గేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టి నిజాయితీగా ప్రయత్నం చేస్తే తక్కువ బడ్జెట్లోనే సినిమా తయారవుతుందని.. ఒకవేళ బడ్జెట్ ఎక్కువైనా అందుకు తగ్గ విజయమే దక్కుతుందని రుజువు చేశాయి కొన్ని చిత్రాలు.

అందుకు ‘కంచె’, ‘ఘాజీ’, ‘మహానటి’ లాంటి చిత్రాలు ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరిన్ని సాహసోపేత సినిమాలు రెడీ అవుతున్నాయి టాలీవుడ్లో. ఈ కోవలోనే రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వీరూ పోట్ల ఒక వెరైటీ సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శ్రీకృష్ణ దేవరాయలు నాటి కాలంలో సాగే ఒక వినోదాత్మక కథను వీరూ రెడీ చేశాడట. ఆ కాలానికి.. వర్తమానానికి ముడిపెడుతూ ఈ కథను నడిపిస్తాడట.

ఈ సినిమా కోసం మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. ఒకే తరహా మాస్ మసాలా సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న తేజు ఇప్పుడు రూటు మార్చాడు. ‘తేజ్ ఐ లవ్యూ’లో తొలిసారిగా పూర్తి స్థాయి ప్రేమకథ ట్రై చేసిన తేజు.. మున్ముందు కూడా వైవిధ్యమైన సినిమాలే చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వీరూ సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం.

ఐతే రాయల నాటి కథలో సాయిధరమ్ తేజ్ అంటే ఊహే కొంచెం చిత్రంగా ఉంది. ఇలాంటి కథకు అతను సెట్టవుతాడా అనేది డౌట్. ఐతే ఒక దర్శకుడు నమ్మి అతడితో ఈ తరహా కథ చేయాలనుకున్నాడంటే పూర్తి స్పష్టతతో ఉన్నట్లే. ‘బిందాస్’, ‘దూసుకెళ్తా’ లాంటి సినిమాలతో సత్తా చాటుకున్న వీరూ.. చివరగా ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. మరి ఈ సినిమాతో అయినా పుంజుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు