కమల్ ను ఇరికించిన శృతి హాసన్

కమల్ ను ఇరికించిన శృతి  హాసన్

సినీ న‌టుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ అనూహ్య‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్ప‌టికే హిందువుల వ్య‌తిరేకి అని ప‌లు వ‌ర్గాల‌తో ముద్ర వేయించుకున్న ఆయ‌న తాజాగా దీనికి బ‌లం చేకూర్చేలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. కులం గురించి క‌మ‌ల్ ఆద‌ర్శ‌భావాల‌ను వ్య‌క్త‌ప‌రిస్తే...ముందు తన ఇంటిని చక్కబెట్టుకుని కుల వ్యవస్థ నిర్మూలన గురించి ప్రజలకు బోధించాలని పలువురు ట్విట్టర్ యూజర్లు కమల్‌కు సూచించారు.

కమల్‌హాసన్ ఇటీవల ట్విట్టర్‌లో ``నేను నా ఇద్దరు కుమార్తెలను పాఠశాలల్లో చదివించేటప్పుడు దరఖాస్తుల్లో కులం, మతం కాలమ్స్‌ను పూరించలేదు. భవిష్యత్ తరాలకు మనం చూపే ఏకైక మార్గం ఇదే. ప్రతి వ్యక్తి ఈ దిశగా ప్రయత్నం ప్రారంభించాలి. కేరళ ప్రభుత్వం దీనిని అమలుపరుస్తోంది. ఈ మార్గాన్ని అనుసరిస్తున్న వారు వేడుక చేసుకోవాలి`` అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పలువురు నెటిజ‌న్లు ఘాటుగా రియాక్ట‌య్యారు. కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్ కొన్నేళ్ల‌ కింద ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను ట్విట్ట‌ర్‌ పోస్ట్ చేసి కమ‌ల్‌కు కౌంట‌ర్ ఇచ్చారు .

తాము అయ్యంగార్లమని (వైష్ణవుల్లో ఓ శాఖ) అని శృతి వెల్లడించ‌డం ఈ వీడియోల స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ వీడియోను ఉదహరించిన ట్విట్టర్ యూజర్లు ముందు సంస్కరణలు తన ఇంటి నుంచి అమలు చేయాలని కమల్‌కు సలహా ఇచ్చారు. జంధ్యాన్ని తొలిగించుకోవడం.. సర్టిఫికెట్లలో కులం పేరు రాసుకోకపోవడం అనేవి సమస్యకు పరిష్కారం చూపలేవని ఒకరు పేర్కొనగా.. కమల్‌హాసన్ అయ్యంగార్ అని శృతి సగర్వంగా ప్రకటించారని మరొకరు ఎద్దేవా చేశారు.

మరోవైపు తాను పూనూల్ (తమిళంలో జంధ్యం) ధరించడం లేదని కమల్ ట్విట్టర్‌లో పేర్కొనడాన్ని కూడా పలువురు తప్పుబట్టారు. జంధ్యం ధరించడం గురించి మాట్లాడి మీరు మీ గుర్తింపును బహిరంగంగా వెల్లడించారు అని విమర్శించారు. రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న క‌మల్ ఇలా వివాదాల‌ను కెలుక్కోవ‌డం ఏమిట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు