డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే మరణ శిక్షే?

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే మరణ శిక్షే?

సరిగ్గా ఏడాది కిందట తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ కేసు ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఈ కేసు ఎంతవరకు వచ్చింది... అప్పుడు పట్టుకున్న ప్రముఖులకు నిజంగానే డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే దేశంలో డ్రగ్స్ సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్న రాష్ట్రం పంజాబ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. మాదక ద్రవ్యాల స్మగర్లకు ఏకంగా మరణ శిక్ష విధించేలా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

    మాదకద్రవ్యాల స్మగ్లర్లకు మరణ శిక్ష విధించేలా చట్టం చేయాలంటూ కేంద్రాన్ని కోరాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పంజాబ్‌ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అధ్యక్షతన సోమవారం క్యాబినెట్‌ భేటీ జరిగింది. డ్రగ్స్‌ మహమ్మారి వల్ల ఎన్నో తరాలు నాశనమవుతున్నాయని సీఎం అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. అందుకే ఈ దందా చేసే వారికి మరణ దండన విధించేలా చట్టం చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నట్టు వివరించారు. పంజాబ్‌ ను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా చెయడానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా, కేసులు, దర్యాప్తు జరుగుతున్న తీరు తదితర అంశాలను మంత్రివర్గం చర్చించింది.

    డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టాలంటే సాధారణ శిక్షల కంటే మరణ దండనే మేలని అభిప్రాయపడింది. గత ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లి ఎన్నికల్లో డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టడం ప్రధానాంశంగా మారింది. పంజాబ్‌ ను డ్రగ్స్‌ రహితంగా మారుస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా మరణ శిక్ష దిశగా అడుగులు వేస్తుండడంతో దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. మరి, దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు