వర్మను ఆకాశానికెత్తేసిన గ్రేట్ డైరెక్టర్

వర్మను ఆకాశానికెత్తేసిన గ్రేట్ డైరెక్టర్

రామ్ గోపాల్ వర్మ పేరెత్తితే తిట్టేవాళ్లే కనిపిస్తున్నారు కొన్నేళ్లుగా. అందులోనూ గత కొన్ని నెలల పరిణామాలు.. ‘ఆఫీసర్’ సినిమా చూశాక తిట్లు మరింత పెరిగాయి. ఇలాంటి టైంలో వర్మను పొగిడేవాళ్లు అరుదుగా ఉంటారు. కానీ బాలీవుడ్లో గొప్ప దర్శకుడిగా పేరున్న అనురాగ్ కశ్యప్.. ఈ రోజు రామ్ గోపాల్ వర్మను తెగ పొగిడేశాడు. ఇందుకు సందర్భం లేకపోలేదు.

వర్మ తీసిన ‘సత్య’ సినిమా విడుదలై ఈ రోజుకు సరిగ్గా 20 ఏళ్లు పూర్తయింది. బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ రచయితగా పని చేశాడు. ఈ సినిమాతో అతడికి చాలా మంచి పేరొచ్చింది. తర్వాత అతడి రాత మారిపోయింది. దర్శకుడిగా మారి ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ సహా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. అదే సమయంలో వర్మ పతనమైపోతూ వచ్చాడు.

ఐతే ఇప్పుడు వర్మ స్థాయి ఏంటో చూడకుండా తనకు రచయితగా తొలి అవకాశం ఇచ్చిన అతడిపై కృతజ్ఞత చూపించాడు అనురాగ్. 20 ఏళ్ల కిందట రచయితగా తన తొలి సినిమా విడుదలైందని.. అది తన జీవితాన్ని మార్చేసిందని.. ఈ సినిమాలో భాగస్వామి కావడం ప్రపంచంలో అత్యుత్తమ ఫిలిం స్కూల‌్‌కు వెళ్లడంతో సమానమని.. ఈ సినిమా నుంచి, వర్మ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతూ వర్మకు థ్యాంక్స్ చెప్పాడు కశ్యప్.

దీనికి వర్మ స్పందిస్తూ.. గొప్ప సినిమాలు వాటంతట అవే గొప్పగా తయారవుతాయని.. ఎవ్వరూ వాటిని గొప్పగా తీయాలని తీయరని.. మనం గర్భం దాలుస్తాం కానీ బిడ్డ అనేది దానంతట అదే జీవం పోసుకుంటుందని.. అలాగే సత్య అనే బిడ్డ దానంతట అది ఎదిగి దాని తల్లిదండ్రులైన మనకు ఎంతో పేరు తెచ్చిందని అన్నాడు. అప్పటికే ‘శివ’తో దక్షిణాదిన గొప్ప పేరు తెచ్చుకున్నప్పటికీ.. ‘రంగీలా’తో బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసినప్పటికీ ‘సత్య’ సినిమాతో దేశవ్యాప్తంగా వర్మ పేరు మార్మోగింది. అతను ఇండియన్ గ్రేట్ ఫిలిం మేకర్లలో ఒకడనిపించున్నది ఈ సినిమాతోనే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు