ముస్లిం నేతకు మంత్రి పదవి ఇస్తున్న చంద్రబాబు?

ముస్లిం నేతకు మంత్రి పదవి ఇస్తున్న చంద్రబాబు?

బీజేపీతో పెటాకుల తరువాత చంద్రబాబు కేబినెట్లో ఖాళీ అయిన స్థానాలు భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ముస్లిం నేత ఒకరికి అవకాశమివ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.

గతేడాది ఏప్రిల్‌లో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అప్పట్లోనే మైనారిటీల నుంచి ఒకరిని కేబినెట్‌లోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే అది జరగలేదు. అనంతరం బీజేపీతో విభేదాల కారణంగా ఆ పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో మంత్రి వర్గంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇందులో ఓ పదవిని మైనారిటీ నేతతో భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం.

నిజానికి టీడీపీలో ఇద్దరు మైనారిటీ నేతలు జలీల్ ఖాన్, చాంద్ బాషా ఉన్నప్పటికీ, వారిద్దరూ వైసీపీ టికెట్లపై గెలిచి టీడీపీలో చేరినవారు. జలీల్ ఖాన్‌ను ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఇప్పుడు షరీఫ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీ నేతలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారిలో ఒకరు ఎన్ఎండీ ఫరూఖ్ కాగా, ఇంకొకరు షరీఫ్. ఫరూఖ్ రాయలసీమకు చెందిన వారు కాగా, షరీఫ్ కోస్తా నేత. రాయలసీమలో మైనారిటీల సంఖ్య ఎక్కువ కాబట్టి తొలుత ఫరూఖ్‌నే కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు.

అయితే, ఫరూఖ్ ప్రస్తుతం శాసన మండలి చైర్మన్‌గా ఉన్నారు. ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయిస్తే మరో సీనియర్‌తో దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ ఆలోచనను విరమించుకుని షరీఫ్‌నే కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకో బెర్తు కోసం నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు