విమానం టికెట్ కంటే..ఈ ట్రైన్ ధ‌రే ఎక్కువ

విమానం టికెట్ కంటే..ఈ ట్రైన్ ధ‌రే ఎక్కువ

బుల్లెట్ ట్రైన్‌ పేరుతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సృష్టిస్తున్న హ‌డావుడి సంగ‌తి తెలిసిందే. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ ట్రైన్ గురించి ఎన్ని వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నా...మ‌రోవైపు ఈ ప్రాజెక్ట్ విష‌యంలో పాల‌క‌ప‌క్షం వేగంగానే ముందుకు సాగుతోంది.

తాజాగా బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి రెండు షాకింగ్ వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ అధికారి,ఢిల్లీ మెట్రో ట్రైన్‌ ప్రాజెక్టు వ్యూహకర్త శ్రీధరన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు వ్యయం రూ. 1.10లక్షల కోట్లు (2017లో ఇండియన్‌ రైల్వే మొత్తం బ‌డ్జెట్ కేటాయింపుల‌కు సమానం)గా అంచనా వేస్తున్న నేప‌థ్యంలో శ్రీ‌ధ‌ర‌న్ మీడియాతో మాట్లాడుతూ బుల్లెట్‌ ట్రైన్ సాధారణ ప్రజలు అందుకోలేనంత ఖరీదైనదని, డబ్బున్న పెద్దలకే బుల్లెట్‌ ట్రైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు.  

దేశ ప్రజలకు అత్యంత ఖరీదైన ట్రైన్‌లు కాదు.. ఆధునికమైన, మెరుగైన భద్రత, వేగవంతమైన రైల్వే వ్యవస్థ అవసరమున్నదని శ్రీధరన్‌ చెప్పారు. భారత రైల్వే వేగంగా అభివృద్ధి చెందుతోందన్న అభిప్రాయాలతో తాను ఏకీభవించబోనని, బయో టాయిలెట్లు మినహా కొత్తగా సాంకేతిక పురోగతి ఏమీ లేదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన మహారాష్ట్ర-గుజరాత్‌లలో ఈ ప్రాజెక్టుకోసం భూసేకరణ విషయమై స్థానిక రైతులు ప్రతిఘటిస్తున్న సందర్భంలో మెట్రోమ్యాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తాజాగా ఢిల్లీలో శ్రీ‌ధ‌ర‌న్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశ రైల్వే 20 ఏళ్లు వెనకబడి ఉన్నట్టు తాను భావిస్తున్నాని చెప్పారు. ట్రైన్‌ల స్పీడూ పెరగకపోవడమే కాదు ప్రముఖ రైళ్ల సగటు వేగం తగ్గిందని తెలిపారు. సమయపాలన పాటిస్తున్న రైళ్లు 70శాతంగా ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయని, అనధికారికంగా 50శాతానికి తక్కువే ఉంటాయని అభిప్రాయపడ్డారు. లెవల్‌ క్రాసింగ్‌లో ట్రాక్‌లపై అనేక మంది మృతిచెందుతున్నారని, ట్రాక్‌లపై యేటా 20వేల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. బుల్లెట్ ట్రైన్ కంటే సాధార‌ణ రైళ్ల విష‌యంలో స‌ర్కారు దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

మ‌రోవైపు ఈ బుల్లెట్ ట్రైన్ సామాన్యుల‌కే కాదు..మాన్యుల‌కు సైతం జేబుకు చిల్లుపెట్టేద‌ని తేలింది. ఐఐఎం అహ్మదాబాద్ చేసిన‌ అధ్యయనంలో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ ట్రైన్ టికెట్‌ ధర రూ. 3000గా ఉండొచ్చని అంచనా వేసింది. బుల్లెట్‌ ట్రైన్ టికెట్ ధ‌ర మొత్తంతో ఈ రెండు నగరాల మధ్య గంట వ్యవధిలో విమాయానమే చేయొచ్చని పేర్కొంది. మ‌రోవైపు బుల్లెట్ ట్రైన్ ఆర్థికంగా నిలదొక్కు కోవాలంటే దాదాపు 88వేల నుంచి 118 వేల ప్రయాణికులతో రోజుకు 100 ట్రిప్పులు వేయాల్సి ఉంటుందని ఐఐఎం అహ్మ‌దాబాద్ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. కాగా, ఈ సంఖ్య ప్రతిరోజు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించేవారి సంఖ్యకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు