తెలంగాణ ఇచ్చింది .....అమ్మా కాదు.. బొమ్మా కాదు

తెలంగాణ ఇచ్చింది .....అమ్మా కాదు.. బొమ్మా కాదు

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ల మ‌ధ్య గతంలో చాలా సార్లు ట్వీట్ వార్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ ఇద్ద‌రు నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు సవాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు విసురుకున్న విష‌యం విదిత‌మే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెల‌వ‌క‌పోతే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధ‌మ‌ని కేటీఆర్ విసిరిన స‌వాల్ కు ఉత్త‌మ్ స్పందించ‌లేద‌ని, అయినా త‌న స‌వాల్ అలాగే ఉంటుంద‌ని కేటీఆర్ షాకింగ్ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా, తెలంగాణ ఇచ్చింది .....అమ్మా కాదు.. బొమ్మా కాదు అంటూ సోనియా మీద కేటీఆర్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి. జ‌నం కొడతారనే భయంతోనే 2014లో సోనియా తెలంగాణ ఇచ్చారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల‌పై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌మ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణను సోనియా ఇచ్చారన్న వాస్త‌వాన్ని అంగీక‌రించ‌లేని వారు మూర్ఖులని కేటీఆర్ ను ఉద్దేశించిన సంచ‌ల‌న ట్వీట్ చేశారు.

సోనియా చొర‌వ వ‌ల్లే తెలంగాణ ఏర్ప‌డింద‌ని, అది అంద‌రూ అంగీక‌రించాల్సిన వాస్త‌వ‌మ‌ని అన్నారు. అంతేకాకుండా, తెలంగాణను సోనియా ఇచ్చారని గతంలో మీ తండ్రి కేసీఆర్ వ్యాఖ్యానించార‌ని, ఆ వ్యాఖ్యలతో మీరు విభేదిస్తున్నారా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. నా పార్టీని తీసుకోండి...తెలంగాణ ఇవ్వండి అంటూ కేసీఆర్ గ‌తంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ క్లిప్పింగ్ ను ట్వీట్ చేశారు.

 సోనియా గాంధీ గురించి కేసీఆర్ మాట్లాడుతున్న వీడియో చూడండి ....అంటూ ఓ యూట్యూబ్ లింక్ ను పోస్ట్ చేశారు. యూపీఏ హ‌యాంలో కేంద్ర మంత్రి ప‌ద‌విని కేసీఆర్ అనుభ‌వించార‌ని, ఇపుడు తెలంగాణ సీఎం ప‌ద‌విని అనుభ‌విస్తున్నార‌ని....ఈ రెండు సంద‌ర్భాల్లోనూ తెలంగాణ ప్ర‌జ‌ల, అమ‌ర‌వీరుల త్యాగాల‌ను విస్మ‌రించార‌ని అన్నారు. మోసాల‌కు, న‌య వంచ‌న‌కు టీఆర్ ఎస్ చిరునామాగా మారింద‌ని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ప్ర‌జ‌లు స‌రైన గుణ‌పాఠం నేర్పుతార‌ని ఉత్త‌మ్ హెచ్చరించారు. ఈ ఇద్దరి ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.