‘పెళ్ళిచూపులు’ ఆడదేమో అని ఏడ్చాడట

‘పెళ్ళిచూపులు’ ఆడదేమో అని ఏడ్చాడట

రెండేళ్ల కిందట టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన సినిమా ‘పెళ్ళిచూపులు’. దాదాపు అందరూ కొత్త వాళ్లతో కొత్త దర్శకుడైన తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ చిత్రం అగ్ర నిర్మాత సురేష్ బాబును మెప్పించింది. ఆయన ఈ చిత్రాన్ని చక్కగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. అది మంచి విజయం సాధించింది. ఐతే ఈ సినిమా విడుదలకు ముందు తాను పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావని అంటున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.

స్వయంగా తనకే ఈ చిత్రంపై ఒక దశలో నమ్మకం పోయిందని అతనన్నాడు. ఈ సినిమాను కొందరు డిస్ట్రిబ్యూటర్లకు చూపిస్తే.. వాళ్లందరూ పెదవి విరిచారని అతను చెప్పాడు. దీంతో తన తల్లి దగ్గరికెళ్లి.. సినిమా ఆడదంటున్నారంటూ తాను బోరున ఏడ్చేశారని.. ఆమె తనను ఓదార్చి ఆత్మవిశ్వాసం నింపిందని తరుణ్ వెల్లడించాడు.

ఒక డిస్ట్రిబ్యూటర్ ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి దగ్గరికొచ్చి ‘నీకు డబ్బులంటే ఇంట్లో కూర్చుని తిను. అంతే తప్ప ఇలాంటి సినిమాల మీద పెట్టకు’ అన్నాడని... అప్పుడు తాను పక్కనే ఉన్నానని చెప్పాడు తరుణ్. ఆ మాట అన్నాక ఈ చిత్రానికి దర్శకుడెవరు అని ఆ డిస్ట్రిబ్యూటర్ అడిగాడని.. తనను చూపించాక సినిమాలో ఏమైనా స్కిన్ షో ఉందా అన్నాడని.. తనకు ఒళ్లు మండి ‘లేదు.

సినిమాలో అందరూ బట్టలు వేసుకుంటారు’ అని వెటకారంగా బదులిచ్చానని తరుణ్ తెలిపాడు. ఐతే రిలీజ్ ముంగిట ఎందరు ఎన్ని మాటలన్నా.. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనను దర్శకుడిగా నిలబెట్టిందని.. తర్వాత అందరి నోళ్లూ మూత పడ్డాయని  తరుణ్ భాస్కర్ చెప్పాడు. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు