బ్యాడ్‌లక్ః అరుణా అమెరికాలో ఓడిపోయింది

బ్యాడ్‌లక్ః అరుణా అమెరికాలో ఓడిపోయింది

అమెరికా ద్వారా మ‌రో దుర్వార్త వ‌చ్చింది. ఈ ద‌ఫా వీసాల విష‌యంలో కాకుండా చ‌ట్ట‌స‌భ‌ల విష‌యంలో వినిపించింది. అమెరికా కాంగ్రెస్‌లో అడుగు పెట్టేందుకు ఇద్దరు మహిళలతోపాటు ఆరుగురు ఇండో అమెరికన్లు చేసిన ప్రయత్నాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రత్యేకించి హైద‌రాబాదీ బిడ్డ‌కు తీపిక‌బురు వినిపించ‌లేదు. మేరీలాండ్ స్థానం నుంచి డెమొక్రాట్ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన అరుణా మిల్లర్ (53) ఓడిపోయారు.

ఆమె హైదరాబాద్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక న్యూయార్క్ నుంచి పోటీ పడిన సూరజ్ పటేల్ తన సహచర డెమొక్రాట్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. మేరీలాండ్ స్థానం నుంచి మంగళవారం జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీస్‌లో సహచర డెమొక్రాట్ డేవిడ్ ట్రోన్ చేతిలో అరుణామిల్లర్ ఓడిపోయారు. ఓటమిని అంగీకరించిన అరుణామిల్లర్.. తన ప్రచారం మేరీలాండ్‌తోపాటు దేశవ్యాప్తంగా వందల మంది అమెరికన్లకు స్ఫూర్తినిచ్చిందన్నారు. సొంతంగా కోటి డాలర్లు ఖర్చు చేసిన డేవిడ్ ట్రోన్ కేవలం 10 శాతం ఓట్ల తేడాతోనే ఆమెపై విజయం సాధించగలిగారు.

మేరీలాండ్‌లోని మరో స్థానానికి పోటీ పడ్డ ఇండో అమెరికన్ ఉత్తమ్ పాల్ కేవలం 3.7 శాతం ఓట్లు మాత్రమే పొందారు. న్యూయార్క్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ సభ్యురాలు కరోల్యిన్ మాలోనెయ్ (72)కు గట్టి పోటీ ఇచ్చినా యువ ఇండో అమెరికన్ సూరజ్ పటేల్ ఓటమిపాలయ్యారు. న్యూయార్క్‌లోని మరో స్థానం నుంచి పోటీ పడిన మరో ఇద్దరు ఇండో అమెరికన్లు ఒమర్ వైద్, రాధాకృష్ణమోహన్ మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు. కొలారెడో స్థానం నుంచి డెమొక్రాట్ అభ్యర్థిత్వానికి పోటీ పడిన మరో ఇండో అమెరికన్ సైరారావు ప్రస్తుత కాంగ్రెస్ సభ్యురాలు డయానా డిగెట్టే చేతిలో ఓటమికి గురయ్యారు. త్వరలో జరుగనున్న అమెరికా దిగువ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకోసం డెమొక్రాట్ పార్టీలో ఈ ఎన్నికలు నిర్వహించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు