త‌మిళ అసెంబ్లీలో తెలుగు భాష‌ రికార్డ్

త‌మిళ అసెంబ్లీలో తెలుగు భాష‌ రికార్డ్

పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని వారే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా హర్షించే ఘ‌ట‌న జ‌రిగింది. రాష్ట్రంలో మైనార్టీ భాషలు ఎదుర్కొంటున్న సమస్యపై సభలో చర్చించారు. తాల్లి నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే వై ప్రకాశ్ ఆ చర్చను ప్రారంభించారు. మైనార్టీ భాష గురించి మాట్లాడుతూ   తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ సమయంలో స్పీకర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి సెంగోటియన్ కూడా సభలోనే ఉన్నారు. రాష్ట్రంలో తెలుగు, ఉర్దూ, కన్నడ భాషలను మైనార్టీలుగా చూస్తున్నారని, వాళ్లకు సరైన గౌరవం దక్కడ లేదని డీఎంకే ఎమ్మెల్యే అన్నారు. మైనార్టీ విద్యార్థులు బలవంతంగా తమిళంలో పరీక్షలు రాస్తున్నారని అన్నారు. గత రెండేళ్లుగా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు అని ఆయన ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఓ సమస్యపై తెలుగు భాషలో మాట్లాడటం, పైగా ఆయ‌న ప్ర‌తిప‌క్ష‌మైన
డీఎంకే ఎమ్మెల్యే కావ‌డంతో  మంత్రి సెంగోటియన్ స్పందించారు. స్థానిక విద్యార్థులకు రెండేళ్లు, మరో ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు నాలుగేళ్ల వరకు పరీక్షలు స్వంత భాషలో రాసుకునేందుకు మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. మరో మంత్రి బాలకృష్ణ రెడ్డి కూడా తెలుగులో మాట్లాడారు. తమిళ భాషను తప్పనిసరిగా చేసిన డీఎంకే పార్టీని ఆయన తప్పుపట్టారు. మైనార్టీ భాషల రక్షణకు మాజీ సీఎం జయలలిత అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఒకవైపు తమిళ ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడుతుంటే.. కొందరు ఎమ్మెల్యేలు నవ్వుకుంటూ బల్లలు చరుస్తూ ఉండిపోయారు.

ఇదే చర్చలో డీఎంకే ఎమ్మెల్యే తంగం తెన్నరాసు పాల్గొన్నారు. ఆయన కూడా తెలుగులో మాట్లాడారు. మైనార్టీ భాషల పట్ల తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అయితే ఎమ్మెల్యేలంతా తెలుగులో మాట్లాడుతుంటే.. స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని చర్చకు ముగింపు పలికారు. అసెంబ్లీలో తెలుగు తర్జుమా డెస్క్ లేదని, తర్జుమా చేసిన రికార్డులు ఇస్తే వాటిని రికార్డు చేస్తామని స్పీకర్ తెలిపారు. లేదంటే ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడారని రాస్తామన్నారు. దీంతో సభలో మళ్లీ నవ్వులు పూశాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English