కేటీఆర్ పుణ్యమా అని ఆ సినిమాకు హైప్!

కేటీఆర్ పుణ్యమా అని ఆ సినిమాకు హైప్!

రాజ‌కీయాల మీద ప‌ట్టున్న చాలామంది నేత‌లు వేరే రంగాల గురించి మాట్లాడే విష‌యంలో త‌డ‌బాటుకు గురి అవుతుంటారు. మాట్లాడినా.. నాలుగైదు ముక్క‌లు చెప్పేస్తారే త‌ప్పించి.. త‌మ‌కున్న ప‌ట్టును ప్ర‌ద‌ర్శించ‌లేరు. కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అందుకు భిన్నం. రాజ‌కీయాల్లో ఆరితేరిన ఆయ‌న సినిమాల గురించి చెప్పాల్సి వ‌స్తే.. నాన్ స్టాప్ గా చెప్పేస్తుంటారు. అందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా జ‌రిగిన ఈ న‌గ‌రానికి ఏమైంద‌న్న మూవీ ప్రీరిలీజ్ వేడుకను చెప్పొచ్చు.

త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీకి సురేశ్ బాబు నిర్మాత‌. ఈ వేడుక‌లో కేటీఆర్ చెప్పిన మాట‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. సినిమాల మీద ఆయ‌న‌కున్న అవ‌గాహ‌న ఇట్టే అర్థ‌మ‌య్యేలా చేస్తుంది.అంతేకాదు..సినిమాల విష‌యంలో త‌న‌కున్న ఆస‌క్తిని త‌న మాట‌ల‌తో కేటీఆర్ చెప్పేశార‌ని చెప్పాలి.

కాస్తంత స‌ర‌దాగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మాట‌ల్ని య‌థాత‌ధంగా చెప్పేస్తే.. ‘‘చేనేత కళాకారులకు మద్దతుగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలే ధరించాలనే ఓ రూల్ పెట్టుకున్నాం. ఇందులో పొల్గొన్న నటీనటులు, సాంకేతిక నిపుణులంతా చేనేత వస్త్రాలే ధరిస్తామ‌ని మాట ఇచ్చారు. అందుకే వచ్చా. ఈ సినిమా టైటిల్‌ చూసి కంగారు పడ్డా. ఎందుకంటే నేను తెలంగాణ పట్టణాభివృద్ధిశాఖ మంత్రిని. వర్షాకాలం వస్తే చాలు.. ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగులు పెడుతుంటారు. అలాంటి కథేమో అనుకున్నా. కానీ కాదని తెలిసింది" అని చెప్పారు.

త‌రుణ్ భాస్క‌ర్ తీసిన పెళ్లిచూపులు సినిమా అంటే చాలా ఇష్ట‌మ‌ని.. త‌రుణ్ కుటుంబంతో త‌న‌కు ముందే ప‌రిచ‌యం ఉంద‌న్నారు. కానీ.. త‌రుణ్ ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడేవాడే కాద‌న్న కేటీఆర్‌.. సురేశ్ బాబు చెప్ప‌టంతో తాను ఆ సినిమాను చూశాన‌ని చెప్పారు. సినిమా చూశాక‌.. ఆ సినిమాకు ప‌ని చేసిన వారిని అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయిన‌ట్లు చెప్పారు.
ఒక‌సినిమా స‌క్సెస్ అయ్యాక త‌ర్వాతి సినిమాను పేరున్న న‌టులుతో.. హంగామా తీస్తారు. కానీ.. అందుకు భిన్నంగా త‌రుణ్ భాస్కర్ మాత్రం క‌థ మీద న‌మ్మ‌కంతో స్టార్స్ లేకుండా సినిమా తీసిన‌ట్లు చెప్ప‌గానే తాను ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు చెప్పారు.

రోడ్‌..హ్యాంగోవ‌ర్‌.. జింద‌గీ నా మిలేగే దుబారా లాంటి సినిమాలంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని.. ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా కూడా అలాంటి కోవ‌కే చెందుతుందన్నారు. మొత్తానికి త‌న మాట‌ల‌తో ఈ న‌గ‌రానికి ఏమైంది మూవీకి స‌రికొత్త హైప్ తీసుకురావ‌టంతో మంత్రి కేటీఆర్ స‌క్సెస్ అయ్యారు.