కాన్ఫిడెన్స్ మాట‌ల‌తో కాంగ్రెస్ కు కేసీఆర్ "సినిమా"

కాన్ఫిడెన్స్ మాట‌ల‌తో కాంగ్రెస్ కు కేసీఆర్

మాట‌ల‌తో చుక్క‌లు చూపించే త‌త్త్వం అంద‌రికి ఉండ‌దు. అందునా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరులో మాట్లాడ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అర‌చేతిలో వైకుంఠాన్ని చూపించేలా మాట్లాడే ఆయ‌న‌.. అవే మాట‌ల‌తో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు ఊపిరి ఆడ‌న‌ట్లు చేస్తుంటారు. తాజాగా అలాంటి మాట‌లే చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు హ‌ర్ర‌ర్ సినిమాను క‌ళ్ల ముందు క‌ద‌లాడేలా చేశారు.

మాజీ మంత్రి.. హైద‌రాబాద్ లో బ‌ల‌మున్న నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న దానం నాగేంద‌ర్ ను గులాబీ కారు ఎక్కేందుకు ఓకే చెప్పేసిన కేసీఆర్‌.. దానం జాయినింగ్ సంద‌ర్భంగా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.ఈ  సంద‌ర్భంగా కాంగ్రెస్ ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక ద‌శ‌లో ముంద‌స్తుకు వెళ‌దామా?  అంటూ స‌వాలు సైతం విసిరారు.  ఇంత కాన్ఫిడెంట్ గా తానెందుకు ఉన్న‌ద‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్పేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాద‌ని తేల్చేశారు. ఆ మ‌ధ్య వ‌ర‌కు నాలుగైదు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌న్న కేసీఆర్‌.. తాజాగా మాత్రం అకౌంట్ తెరిచే అవ‌కాశ‌మే లేద‌న్నారు. తానేదో ఆవేశంతో చెప్పిన‌ట్లు కాద‌న్న‌ట్లు త‌న మాట‌ల‌కు లెక్కలు చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల తాను స‌ర్వేలు చేయించాన‌ని.. అందులో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాద‌ని తేలిన‌ట్లుగా చెప్పారు. మ‌రికొద్ది రోజుల్లో మ‌రో ప్రెస్ మీట్ పెట్టి తాను చేయించిన స‌ర్వే రిపోర్ట్ ను డిటైల్డ్ గా ప్ర‌జ‌ల ముందు పెడ‌తాన‌ని చెప్ప‌టం చూస్తే.. తాను ఉత్త‌గా ఏమీ మాట్లాడ‌లేద‌న్న భావ‌న క‌లిగేలా చేశార‌ని చెప్పాలి.

ఇంత‌కీ కేసీఆర్ చెప్పిన‌ట్లుగా కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదా? అన్న‌సందేహాలు అక్కర్లేదు. కాకుంటే.. కాంగ్రెస్ ఓట‌మి ఎంత దారుణంగా ఉంటుందో.. అదే స‌మ‌యంలో త‌మ గెలుపు ఎంత భారీగా ఉంటుందో చెప్పే క్ర‌మంలో అలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని చెప్పాలి. త‌న మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌డ పుట్టించ‌టం కేసీఆర్‌కు అల‌వాటే. అదే తీరును తాజాగా ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. నిజంగానే.. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాకుంటే.. ఇప్పుడు టీడీపీని ప‌ట్టించుకోన‌ట్లుగా ప‌ట్టించుకోవ‌ట‌మే మానేస్తార‌ని చెప్పాలి.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా బీజేపీ కంటే కాంగ్రెస్సేన‌న్న విష‌యం కేసీఆర్ కు తెలిసిందే. అందుకే ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించేందుకు వీలుగా వ‌ణుకు పుట్టించే మాట‌లు ఆయ‌న‌ నోట వ‌చ్చాయ‌ని చెప్పాలి.  అంతేకాదు.. కాంగ్రెస్ నేత‌ల్లో అయోమ‌యానికి గురి చేసే మ‌రో మాట చెప్పారు. గులాబీ కారు ఎక్కేందుకు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు సిద్ధంగా ఉన్నార‌ని చెప్ప‌టం ద్వారా.. కాంగ్రెస్ పార్టీలో ఓట‌మి భ‌యం ఎంత ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మీద ఉన్న ధీమాతో కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ భారీ సినిమానే  చూపించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు