కేసీఆర్ జోస్యం.. ఈ ముగ్గురు సీఎంల‌కు మూడిన‌ట్లే!

కేసీఆర్ జోస్యం.. ఈ ముగ్గురు సీఎంల‌కు మూడిన‌ట్లే!

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల మీద టీఆర్ఎస్ అధినేత‌.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎంత ప‌ట్టు ఉందో.. ఇత‌ర రాష్ట్రాల మీద అంత‌గా అవ‌గాహ‌న ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ  ప్ర‌జ‌ల గురించి ఆయ‌న చెప్పే మాట‌లు.. జోస్యాలు చాలావ‌ర‌కూ వాస్త‌వ రూపం దాలుస్తుంటాయి. అదే స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల మీదా.. అక్క‌డి రాజ‌కీయం మీదా కేసీఆర్ చెప్పే జోస్యాలేవీ వ‌ర్క్ వుట్ కావు. ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే.. కేసీఆర్ జోస్యం చెప్పారంటే.. పక్క‌గా ఆ ప‌ని కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు గుర్తున్నాయిగా. ఆ ఎన్నిక‌లకు సంబంధించిన పోలింగ్ పూర్తి అయిన త‌ర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కావ‌టం ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ విజ‌యం సాధించ‌నున్న విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఏపీలో జ‌గ‌న్ సీఎం కానున్న‌ట్లుగా చెప్పారు.
జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. తాము ఇరువురం క‌లిసి రెండు తెలుగు రాష్ట్రాల్ని క‌లుపుకెళ్లి అభివృద్ధి సాధిస్తామ‌ని చెప్పారు. కేసీఆర్ జోస్యం విన్న వారంతా షాక్ కు గురయ్యారు.

బీజేపీ.. ప‌వ‌న్‌.. బాబు కాంబినేష‌న్లో ప‌క్కా గెలుపు ఖాయ‌మ‌న్న మాట అంద‌రి నోటా వినిపిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం ఏపీలో గెలుపు జ‌గ‌న్ దేన‌ని చెప్ప‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత చూస్తే.. తెలంగాణ విష‌యంలో కేసీఆర్ చెప్పింది అక్ష‌ర స‌త్య‌మైతే.. ఏపీ విష‌యంలో ఆయ‌న జోస్యం అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. తెలంగాణ త‌ప్పించి.. మ‌రే రాష్ట్రం గురించి కేసీఆర్ మాట్లాడినా.. అక్క‌డ అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయ‌న్న వాద‌నను ప‌లువురు ప్ర‌స్తావిస్తుంటారు.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ఆయ‌న చెప్పిన రాజ‌కీయ జోస్యం.. కేసీఆర్ గ‌తంలోని మాట‌ల్ని మ‌రోసారి గుర్తు చేసేలా చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్.. ఒడిశా ముఖ్య‌మంత్రులు జ‌న‌రంజ‌కంగా పాలిస్తున్నార‌ని.. అలాంటి వారికి ఓట‌మి అన్న‌దే ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల కాలంలో వెలువ‌డిన అంచ‌నాలు.. స‌ర్వే నివేదిక‌లు చెబుతున్న విష‌యం ఏమిటంటే.. త్వ‌ర‌లో జ‌రిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌లోని బీజేపీ ప్ర‌భుత్వాల‌కు కాలం చెల్లింద‌ని.. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట‌మి ప‌క్కా అని తేల్చారు.

ఒడిశా విష‌యంలో మాత్రం కేసీఆర్ మాట నిజం అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఒడిశా మిన‌హా మిగిలిన రెండు రాష్ట్రాల‌పై కేసీఆర్ చెప్పిన జోస్యం త‌ప్పుకావ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. చూస్తుంటే.. ముగ్గురు ముఖ్య‌మంత్రుల గురించి గొప్ప‌గా చెప్పిన జోస్యాల్లో రెండు రాష్ట్రాల్లో మాత్రం దెబ్బ ప‌క్కా అంటున్నారు. మ‌రి.. ఇదెంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది రానున్న రోజులు తేల్చ‌నున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు