టీఆర్ ఎస్ లోకి దానం...రేపు ప్ర‌క‌ట‌న‌?

టీఆర్ ఎస్ లోకి దానం...రేపు ప్ర‌క‌ట‌న‌?

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్య‌క్ష పదవి ద‌క్కక పోవ‌డంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను కాద‌ని మాజీ ఎంపీ అంజన్ కు గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ద‌క్క‌డంతో దానం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో, త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి త‌న రాజీనామా లేఖను దానం పంపించారు. రేపు త‌న కార్య‌క‌ర్తలు, అనుచ‌రుల‌తో చ‌ర్చించి త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని దానం అన్నారు. ఈ నేప‌థ్యంలో, తాజాగా దానం నాగేంద‌ర్ టీఆర్ ఎస్ లో చేర‌బోతున్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను శుక్ర‌వారం నాడు ఆయ‌న స్వ‌గృహంలో కలిసిన దానం....ప‌లు కీల‌క విష‌యాలు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కాంగ్రెస్ కు దానం నాగేంద‌ర్ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా మ‌రోమారు త‌న‌కు అధిష్టానం అవ‌కాశ‌మిస్తుంద‌ని ఆశించిన దానం భంగ‌పాటుకు గుర‌య్యారు. దీంతో, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. అయితే, తాజాగా దానం గులాబీ కండువా క‌ప్పుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. నేడు త‌ల‌సాని ఇంటికి వెళ్లిన దానం ఇదే విష‌యాన్ని చ‌ర్చించిన‌ట్లు వ‌దంతులు వ‌స్తున్నాయి. రేపు మధ్యాహ్నం ఫిలింనగర్  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దానం నాగేందర్ అన్ని విషయాలు వివ‌రంగా వెల్లడిస్తారని త‌ల‌సాని అన్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లోని ప‌లువురు కీల‌క‌మైన నేత‌లు కారెక్క‌డంతో బ‌ల‌హీన ప‌డ్డ కాంగ్రెస్ కు దానం రాజీనామా షాకిచ్చింది. అయితే, మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో `గులాబీ ఆక‌ర్ష్ `కు మ‌రెంత‌మంది నేత‌లు ఆక‌ర్షితుల‌వుతారో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు