అమెరికాలో మ‌న శ‌రణార్థుల సంఖ్య ఇది

అమెరికాలో మ‌న శ‌రణార్థుల సంఖ్య ఇది

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటేటా శ‌రణార్థుల సంఖ్య పెరుగుతోంది. ఉపాధి కోసం ఆరాటంతో ఓ  వైపు...అంతర్యుద్ధాలు చెలరేగడంతో శరణార్థుల జనాభా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 6.85కోట్ల మంది అంతర్యుద్ధాల ఫలితంగా తమ స్వదేశాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ఐరాస పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది.
దానిలోని వివరాల ప్రకారం...ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు నిత్యం అల్లర్లు, యుద్ధాలు, మారణహోమాలతో వణికిపోతున్నారు. ఈ భీతావహ వాతావరణం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలకు వలసపోతున్నారు. ఇందులో మ‌న‌దేశం వారు కూడా ఉండ‌టం..పైగా అగ్ర‌రాజ్యం అయిన అమెరికాలో వీరి సంఖ్య పెద్ద ఎత్తున్నే ఉండటం క‌ల‌కంగా  మారింది.

అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ ఏడువేలమందికి పైగా భారతీయులు గత ఏడాది దరఖాస్తు చేసుకున్నారని ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌ తెలిపింది. 2017లో ఆశ్రయం కోరుతూ అమెరికాకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయని ఐరాస శరణార్థ సంస్థ తన వార్షిక నివేదికలో తెలిపింది. అమెరికాలో ఆశ్రయానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సాల్వడోర్ పౌరులు తొలిస్థానం (49,500)లో ఉన్నారు. ఆ తరువాత మెక్సికో (26,100), చైనా (17,400), హైతీ (8,600), భారత్ (7,400) ఉన్నాయి. కాగా, 2017 చివరి నాటికి భారత్‌లో 1,97,146 మంది శరణార్థులుండగా, 40,391 మంది భారతీయులు ఇతర దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది.

ఇదిలాఉండ‌గా....గ‌త ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.85కోట్ల మంది ప్రజలు తమ స్వదేశాలను వదిలిపెట్టి వెళ్లారు. ప్రపంచం మొత్తం మీద ప్రతి 110 మందిలో ఒకరికి బలవంతంగా తమ దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఖ్య థాయ్‌లాండ్‌ దేశంలోని మొత్తం జనాభాతో సమానం. ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్న వారిలో 70శాతం మంది కేవలం 10 దేశాలకు చెందినవారే కావడం గమనార్హం.ఈ 10 దేశాల్లోని పరిస్థితులు మెరుగుపడితే తప్ప ఇలా స్వదేశాలను విడిచిపెట్టేవారి సంఖ్య తగ్గదని ఐరాస శరణార్థ విభాగం హైకమిషనర్‌ ఫిలిప్పో గ్రాండీ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు