పిల్ల‌ల‌ నిర్బంధం..ట్రంప్ వెన‌క‌డుగు ఓ కుట్రే

పిల్ల‌ల‌ నిర్బంధం..ట్రంప్ వెన‌క‌డుగు ఓ కుట్రే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో  క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నారు. వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ట్రంప్ వాటిని స‌వ‌రించుకోవ‌డంలో కూడా చిత్ర‌మైన లెక్క‌లు వేసుకుంటూ త‌ను టార్గెట్ చేసిన వారి వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నార‌ని అంటున్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేసి నిర్బంధించే విధానాన్ని ఉపసంహరించుకొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు.

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వలస కుటుంబాలను ఎడబాపేలా ప్రస్తుత విధానం ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. కుటుంబాలను ఎడబాపడం నాకిష్టం లేదు అని పేర్కొంటూ ఆయన అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే వలస విధానం విషయంలో తాము ఏమాత్రం తగ్గబోమని, కఠినంగానే వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించినందుకు ఇక కుటుంబం మొత్తాన్ని కలిపే ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేలా చర్యలు చేపడుతామని చెప్పారు.

తాజా నిర్ణ‌యంపై ట్రంప్ స్పందిస్తూ తమ తల్లిదండ్రులకు దూరమైన పిల్లల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు.`మేం కుటుంబాలను కలిపే ఉంచుతాం. అదే సమయంలో వలస విధానంపై కఠినంగానే వ్యవహరిస్తాం. అమెరికా సరిహద్దుల పటిష్ఠానికి చర్యలు కొనసాగుతాయి` అని ట్రంప్ చెప్పారు. ఇకపై కుటుంబాలను కలిపి ఉంచే విచారణ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. మరోవైపు కుటుంబాలను విడదీయడాన్ని నిరసించిన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అమెరికా-మెక్సికో సరిహద్దును గురువారం ఆకస్మికంగా పరిశీలించారు.

ఇదిలాఉండ‌గా... ట్రంప్ నిర్ణ‌యం వెనుక కూడా కుట్ర‌కోణం దాగి ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వులపై ప్రతిపక్షం అసంతృప్తిని వ్యక్తంచేసింది. ``ఇది ఒకరకమైన ఇబ్బందులనుంచి పిల్లలను మరో రకమైన వేధింపుల్లోకి నెట్టేసినట్లే ఉంది. పిల్లల్ని రక్షించడానికి బదులుగా, కుటుంబాల దీర్ఘకాలిక నిర్బంధానికి దారితీసేలా ట్రంప్ ఆదేశాలున్నాయి`` అని డెమోక్రటిక్ నేత నాన్సీ పెలోసి పేర్కొన్నారు. భయాందోళనకు గురైన పిల్లల్ని పరపతిగా వాడుకోవడం భయంకరమైన నైతిక పతనావస్థకు సూచిక అని ఆమె విమర్శించారు. చట్టసభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ స్పందిస్తూ.. ``పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయరాదన్న తాజా ఉత్తర్వులు ఆ కుటుంబాలను ఉమ్మడిగా నిర్బంధించేందుకు దారితీస్తాయి. కుటుంబాలను విడదీయడం ఎంత నేరమో.. కుటుంబం మొత్తాన్ని నిర్బంధించడం కూడా అంతే నేరం`` అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు