సినిమా టికెట్ ధ‌ర‌లు పెరుగుతాయ‌ట‌

సినిమా టికెట్ ధ‌ర‌లు పెరుగుతాయ‌ట‌

ఇప్ప‌టికే క‌ష్టాల సుడిగుండంలోకి చిక్కుకున్న సినిమా ప‌రిశ్ర‌మ‌కు జీఎస్టీ పుణ్య‌మా అని మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటుందా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. జీఎస్టీ కార‌ణంగా సినిమా రంగానికి రానున్న‌ది క‌ష్ట‌కాలంగా టాలీవుడ్ సీనీ ప్ర‌ముఖులు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ వెల్ల‌డించారు. మీడియా.. ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంపై జీఎస్టీ ప్ర‌భావ‌మ‌న్న అంశంపై అసోచాం.. పీడ‌బ్ల్యూసీ నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న‌.. ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు.

రానున్న రోజుల్లో సినిమా టికెట్ ధ‌ర‌లు పెర‌గ‌టం ఖాయ‌మ‌న్నారు. ఇప్పుడు వంద రూపాయిలు ఉన్న టికెట్ ధ‌ర త్వ‌ర‌లోనే రూ.150కి చేరుకుంటుంద‌ని.. అదే స‌మ‌యంలో రూ.150 ఉన్న టికెట్ ధ‌ర రూ.200 ట‌చ్ చేయ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. నిర్మాత‌ల‌కు జీఎస్టీ అద‌న‌పు భార‌మ‌న్న త‌మ్మారెడ్డి.. ప‌న్నుకార‌ణంగా నిర్మాత‌ల‌కు 30 శాతం ఖ‌ర్చుపెరుగుతున్న‌ట్లు చెప్పారు.

రూ.100 దాటిన సినిమా టికెట్ పై ప‌న్ను 28 శాతం ఉంద‌ని.. అంటే.. రూ.150 టికెట్ మీద రూ.42 ప్ర‌భుత్వానికి ప‌న్ను రూపంలో చెల్లించాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇంత ప‌న్ను సినిమా ప‌రిశ్ర‌మ‌కు మంచిది కాద‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే సినిమా టికెట్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌టం ఖాయ‌మన్నారు. అంతేకాదు.. సినిమా హాళ్ల‌ల్లో ల‌భించే ఫుడ్‌.. బెవ‌రేజెస్ కూడా అధిక ధ‌ర‌లు ఉండ‌నున్న‌ట్లు చెప్పారు.

అదే జ‌రిగితే.. అంతిమంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య త‌గ్గుతుంద‌ని.. ఇది కూడా సినీ ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం వాటిల్లేలా చేస్తుంద‌న్నారు. సినిమాను ల‌గ్జ‌రీ కింద తీసివేయాల‌ని ఈ స‌మావేశానికి హాజ‌రైన ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. సినిమా రంగంలో వంద‌లాది మంది వివిధ విభాగాల్లో ప‌ని చేస్తుంటార‌ని.. అలాంటి వారికి న‌ష్టం వాటిల్లేలా ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఉండ‌కూడ‌ద‌న్నారు. ఏమైనా.. జీవితంలో ఒక భాగంగా మారిన సినిమాను ల‌గ్జ‌రీ నుంచి మిన‌హాయిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English