డీకే అరుణ దులిపేసారు

డీకే అరుణ దులిపేసారు

ఓవైపు అధికార పార్టీ అస్త్ర శ‌స్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్న వేళ‌.. వారిపై విజ‌యం సాధించాల‌ని త‌పించే వైరి వ‌ర్గం చేయాల్సిందేమిటి?  గెలుపు కోసం తామంతా ఒక్క‌టై.. ప్ర‌త్య‌ర్థిని ఎలా ఓడించాల‌ని ఆలోచించాల్సి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో టీఆర్ఎస్ పార్టీలో స‌మ‌రోత్సాహం అంత‌కంత‌కూ పెరుగుతుంటే.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి తెలంగాణ కాంగ్రెస్ లో నెల‌కొని ఉంది.

పార్టీలో నెల‌కొన్న అసంతృప్త రాజ‌కీయాలు పార్టీలో త‌మ‌ను తాము తిట్టుకోవ‌టానికే స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారే త‌ప్పించి.. ప్ర‌త్య‌ర్థుల‌పై పోరాడే విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌టం లేదు. ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా జ‌రిగిన టీ పీసీసీ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రిగిన తీరు చూస్తే అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. ఈ స‌మావేశానికి ఢిల్లీ నుంచి వ‌చ్చిన కుంతియా మొద‌లుకొని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి.. ష‌బ్బీర్ అలీ.. భ‌ట్టి.. డీకే అరుణ‌.. పొంగులేటి హాజ‌ర‌య్యారు. వీరంతా కాంగ్రెస్ నేత‌ల ఢిల్లీ టూర్ గురించి ప్ర‌స్తావించారు. ప‌లువురు నేత‌లు ఢిల్లీ టూర్ వెళ్లిన వైనాన్ని ప్ర‌శ్నించారు. పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌టానికి వెళితే ఎవ‌రూ వ్య‌తిరేకించ‌ర‌ని.. కానీ మీడియాలో చ‌ర్చ జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించ‌టం పార్టీకి న‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు.

నేత‌ల ఢిల్లీ టూర్ పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన వారిలో వీహెచ్‌.. పొంగులేటి ప్ర‌ముఖంగా ఉన్నార‌ని చెప్పాలి. ఢిల్లీకి నేత‌ల టూర్ పై త‌న‌కున్న అభ్యంత‌రాల్ని చెప్పే క్ర‌మంలో పొంగులేటి మాట్లాడుతుండ‌గా.. డీకే అరుణ‌.. మ‌ల్లు ర‌వి.. భ‌ట్టి విక్ర‌మార్క అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప‌లువురు వ‌స్తారంటే పీసీసీ ప‌ట్టించుకోవ‌టం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రిని పార్టీలో చేర్చుకునే అంశంపై నేత‌ల‌తో చ‌ర్చించ‌కుండానే పార్టీలో చేర్చుకుంటున్నార‌ని.. ఇలా కొంద‌రి విష‌యంలో ఒక‌లా.. మ‌రికొంద‌రి విష‌యంలో మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటంటూ డీకే అరుణ దులిపేయ‌టంతో పార్టీ స‌మావేశం హాట్ హాట్ గా సాగింద‌ని చెబుతున్నారు. ఇలా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించుకోవ‌టంలోనే విలువైన కాలాన్ని గ‌డిపేయ‌టంపై కాంగ్రెస్ వ‌ర్గాలు నిరాశ‌లో కూరుకుపోతున్నాయి.  చేతిలో అధికారం లేకున్నా.. కోట్లాట‌ల విష‌యంలో మాత్రం ఎంత‌కూ వెన‌క్కి త‌గ్గ‌ని ప్ర‌త్యేక‌త కాంగ్రెస్ పార్టీ సొంతంగా చెప్ప‌క త‌ప్ప‌దు.