క‌న్నా రోడ్ షో... రెస్పాన్స్‌తో బీజేపీకి షాక్‌

క‌న్నా రోడ్ షో... రెస్పాన్స్‌తో బీజేపీకి షాక్‌

ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా లక్ష్మినారాయణ జిల్లాల‌ పర్యటన ఆ పార్టీకి అనూహ్య‌మైన‌ అనుభూతుల‌ను మిగులుస్తోంద‌ని అంటున్నారు. ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీ బ‌లోపేతం కోసం క‌న్నా చేస్తున్న టూర్లు బీజేపీకి క్షేత్ర‌స్థాయిలో ఎలాంటి ఆద‌ర‌ణ ఉందో చెప్తున్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. క‌న్నాకు మొద‌టి టూర్‌లోనే షాక్ త‌గిలేంత జ‌న‌సందోహం వ‌స్తున్నార‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.

అధ్య‌క్షుడిగా నియ‌మితులైన‌ అనంత‌రం ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాను క‌లిసిన క‌న్నా ఏపీలోని జిల్లాల‌ ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను పెట్టుకున్నారు. జూన్ 20 ,21 తేదీల్లో శ్రీకాకుళంలో, జూన్ 22&23లో విజయనగరం జిల్లాలో, జూన్ 24 పోలవరం సంద‌ర్శ‌న‌కు వెళ్లేందుకు క‌న్నా సిద్ద‌మ‌య్యారు. జూన్ 27, 28 తేదీల్లో అనంతపురం, జూన్ 29,30 తేదీల్లో కర్నూలు, జులై 3వ తేదీన నెల్లూరు, జులై 4,5 తేదీల్లో చిత్తూరులో ప‌ర్య‌టించేందుకు క‌న్నా సిద్ధ‌మ‌య్యారు. జిల్లాల‌ పర్యటనకు తొలిసారిగా వస్తున్నందున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారని బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. అయితే, క్షేత్ర‌స్థాయిలో సీన్ రివ‌ర్స్ అయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలి టూరు అయిన శ్రీ‌కాకుళం క‌న్నా టూరు బోసిపోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓపెన్ టాప్ జీప్‌లో క‌న్నా శ్రీ‌కాకుళంలో ప‌ర్య‌టించ‌గా...ఆయ‌న చుట్టూ ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా లేక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ క‌న్నా వాహ‌నం సాగుతుంటే..ఆయ‌న‌కు స్పందించే వారే క‌రువ‌య్యార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. దీంతో ఆయ‌న కాన్వాయ్ అలా దారి వెంట సాగిపోవ‌డం త‌ప్ప ప్ర‌జ‌ల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేద‌ని చ‌ర్చించుకుంటున్నారు.  మ‌రోవైపు, బీజేపీకి క్షేత్ర‌స్థాయిలో ఉన్న బ‌లాన్ని క‌న్నా మొట్ట‌మొద‌టి టూర్ చాటిచెప్పింద‌ని ప‌లువురు ఎద్దేవా చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా... క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ శ్రీ‌కాకుళంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింద‌ని ఆరోపించారు. అడిగినదానికంటే కేంద్రం ఎక్కువే ఇచ్చిందని ఇదే విషయాన్ని స్వయంగా చంద్రబాబు గతంలో చెప్పి, తీరా ఇప్పుడు కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఫిరాయిస్తున్నారని మండిప‌డ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చిన రూ.16వేల కోట్లు తీసుకోవడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయకుండా కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని క‌న్నా తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు