పెళ్లాం చెబితే కానీ ట్రంప్ విన‌లేదే!

పెళ్లాం చెబితే కానీ ట్రంప్ విన‌లేదే!

మ‌హా మొండి మ‌నిషిగా.. వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో త‌న‌కు తానే సాటిగా పేరున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టం తెలిసిందే. అమెరికాలోకి అక్ర‌మంగా వ‌ల‌స వ‌చ్చే వ‌ల‌స‌దారుల నుంచి వారి పిల్ల‌ల్ని వేరు చేయ‌టం.. ఆపైన వారిని బోనులాంటి వాటిల్లో ఉండ‌టం.. త‌ల్లిదండ్రుల కోసం వారు విప‌రీతంగా ఏడుస్తున్న ఫోటోలు.. వీడియోలు వైర‌ల్ కావ‌టం తెలిసిందే.

పెద్ద‌న్న హోదాలో ఉన్న అమెరికా ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటంటే ప‌లువురు తిట్టిపోశారు. ఎంత వ‌ల‌స‌దారులైతే మాత్రం.. మాన‌వ‌త్వం అన్న‌ది లేకుండా ఇలా చేస్తారా? ఇదేం ప‌ద్ధ‌తి అంటూ దేశాల‌కు అతీతంగా అంద‌రూ త‌ప్పు ప‌ట్టారు.

కేవ‌లం వారాల వ్య‌వ‌ధిలో దాదాపు 2500 మంది చిన్నారుల్ని వారి త‌ల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిబిరాల‌కు త‌ర‌లించ‌టం ఒక ఎత్తు అయితే.. త‌ల్లిదండ్రుల‌కు దూర‌మైన చిన్నారులు విప‌రీతంగా ఏడుస్తున్న పిల్ల‌ల ఫోటోలు ప్ర‌పంచ దేశాల్ని క‌దిలించి వేశాయి. అంతేకాదు.. వారిని నిర్బంధించిన వైనాన్ని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ తీరుపై ప్ర‌పంచ దేశాలే కాదు.. అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా సైతం స‌రికాద‌ని తేల్చారు.

భ‌ర్త తీసుకున్న నిర్ణ‌యాన్ని వెంట‌నే మార్చుకోవాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది. అమెరికా- మెక్సికో స‌రిహ‌ద్దుల నుంచి వ‌ల‌స‌దారుల పిల్ల‌ల్ని ఇలా వేరు చేయ‌టం స‌రికాదంటూ త‌న భ‌ర్త ట్రంప్ ను మెలానియా వేడుకున్నార‌ని.. ఆమె వేడుకోలుతో ట్రంప్ ఆలోచ‌న‌లో ప‌డ‌ట‌మే కాదు.. త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటూ తాజా ఉత్త‌ర్వుల మీద సంక‌తం చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు.

కుటుంబాల‌ను విడ‌దీయ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే తానీ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని.. దీంతో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని భావించిన‌ట్లుగా ట్రంప్ వెల్ల‌డించారు. అయితే.. త‌న భార్య చేసిన వేడికోలుతో త‌న నిర్ణ‌యాన్ని మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌ల్లిదండ్రుల నుంచి పిల్ల‌ల్ని వేరు చేయ‌కున్నా.. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై మాత్రం క‌ఠిన నిబంధ‌న‌ల్ని తాము అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

కుటుంబాల్ని క‌లిపి ఉంచేందుకు మీకు చేత‌నైనంత చేయాలంటూ ట్రంప్ ను మెలానియా కోర‌టంతో అధ్య‌క్షుల వారు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా అమెరికా అధ్యక్ష భ‌వ‌నం వెల్ల‌డించింది. మొత్తానికి ఎంత‌కూ మార‌డ‌న్న పేరున్న ట్రంప్ తీరును మెలానియా మార్చ‌గ‌లిగిన స‌త్తా ఉంద‌న్న విష‌యం తాజా ఉదంతంతో రుజువైన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు