‘పెళ్ళిచూపులు’ ముందు కష్టాలపై విజయ్..

‘పెళ్ళిచూపులు’ ముందు కష్టాలపై విజయ్..

ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిన దర్శకులు.. హీరోయిన్లు కనిపిస్తారు కానీ.. ఒక్క సినిమాతో స్టార్ అయిపోయిన హీరోలు అరుదుగా ఉంటారు. వారసత్వంతో వచ్చే స్టార్ ఇమేజిని ఇక్కడ లెక్కలోకి తీసుకోకూడదు. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక్క సినిమా సక్సెస్‌తో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకోవడం మాత్రం అరుదైన విషయమే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ అలాగే ఎదిగాడు. అంతకుముందు ‘ఎవడే సుబ్రమణ్యం’.. ‘పెళ్ళిచూపులు’ లాంటి విజయాలున్నప్పటికీ.. హీరోగా అతడికి ఏ ఇమేజ్ లేదు. కానీ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అతడి రాతే మారిపోయింది. తిరుగులేని ఇమేజ్ వచ్చింది. మార్కెట్ పెరిగింది. ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. ఐతే ‘పెళ్ళిచూపులు’ చేయడానికి ముందు తన పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అంటున్నాడు విజయ్.

తాను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ అనుకోకుండా వచ్చానని.. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చేశాక తాను ఇక్కడ స్థిరపడగలనని నమ్మకం కలిగిందని విజయ్ తెలిపాడు. ఆ సినిమా తర్వాత తనకు వరుసగా అవకాశాలు వస్తాయని ఆశించానని.. కానీ అలా ఏమీ జరగలేదని.. ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయంలో చాలా బాధ పడ్డానని విజయ్ తెలిపాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ‘ఎవడే సుబ్రమణ్యం’ నిర్మాతలైన స్వప్న, ప్రియాంకలను గైడెన్స్ అడిగానని చెప్పాడు. వాళ్ల సాయంతోనే తనకు ‘పెళ్ళిచూపులు’ సినిమాలో అవకాశం దక్కిందని.. ‘అర్జున్ రెడ్డి’ విషయంలోనూ వాళ్లే సాయం చేశారని విజయ్ వెల్లడించాడు. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’తో తనకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదని.. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలతో కలిసి తాను నామినేట్ అయి.. ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంటుంటే తనకు మాటలు రాలేదని విజయ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు