ఢిల్లీలో ఇంత జ‌రుగుతుంటే కేసీఆర్ ఎక్క‌డ‌?

ఢిల్లీలో ఇంత జ‌రుగుతుంటే కేసీఆర్ ఎక్క‌డ‌?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎక్క‌డ‌? ఇప్పుడిదే ఢిల్లీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ అధ్య‌క్ష‌త‌న ఢిల్లీలో నేడు జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ స‌మావేశానికి కేసీఆర్ హాజ‌రుకానున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి రెండ్రోజుల ముందే ఢిల్లీ వెళ్లి మోడీతో భేటీ అయిన కేసీఆర్‌...శ‌నివారం నెల‌కొన్న కీల‌క ప‌రిణామాల సంద‌ర్భంగా అడ్ర‌స్ లేక‌పోవ‌డం ఆస‌క్తిని గొలుపుతోంద‌ని అంటున్నారు. ఐఏఎస్ అధికారుల సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్ తీరుకు వ్యతిరేకంగా ఎల్జీ కార్యాలయంలో ఆరురోజులుగా నిరసన తెలుపుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నలుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఎల్జీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబసభ్యులను బెంగాల్ సీఎం మమత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం కుమార్వస్వామి, కేరళ సీఎం పినరాయి విజయన్ శనివారం పరామర్శించారు. అయితే ఇదే స‌మ‌యంలో ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం..జాడ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆదివారం జరుగనున్న నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనడం కోసం ఢిల్లీకి చేరుకున్న ఈ నాలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు.. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పించాలని ఎల్జీకి లేఖరాశారు. దీనిని లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించడంతో వారు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు ఎల్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మేం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి`` అని కర్ణాటక సీఎం కుమారస్వామి కోరారు.

ఇలా నాలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా ఆ రాష్ట్ర సీఎంకు మ‌ద్ద‌తుగా గ‌ళం విప్పుతుంటే అక్క‌డే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ విష‌యంలో ఏమాత్రం త‌న‌కు పాత్రేమీ లేన‌ట్లుగా ఉండ‌టం ప‌లువురిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఓ వైపు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తాన‌ని చెప్తున్న కేసీఆర్ మ‌రోవైపు ఇలాంటి ప‌రిణామాల విష‌యంలో ప‌ట్టింపు లేన‌ట్లుగా ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు