బీజేపీతో దోస్తీ..క్లారిటీ ఇచ్చి దొరికిపోయిన వైసీపీ

బీజేపీతో దోస్తీ..క్లారిటీ ఇచ్చి దొరికిపోయిన వైసీపీ

ఏపీలో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ ఒక్క‌సారిగా మొద‌లైన ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిపోతోందని చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త బంధాన్ని వెతుక్కుంటూ వెళ్లి గుట్టుగా అడుగులు వేయాల‌ని చూస్తే..అదికాస్తా ర‌ట్టు అయిపోవ‌డ‌మే కాకుండా...పార్టీ ప‌రువు గంగ‌పాల‌య్యేలా మారింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇదంతా వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్‌ బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇద్దరూ కలిసి బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధవ్ ఇంటికి వెళ్లిన ఉదంతం గురించే.

రాంమాధ‌వ్‌తో బుగ్గ‌న భేటీ ద్వారా వైసీపీ-బీజేపీ ర‌హ‌స్య బంధం తేట‌తెల్లం అయిపోయింద‌ని టీడీపీ వాదిస్తోంది. అయితే ఇందుకు వైసీపీ నో చెప్తోంది. తమ నేత మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఒకేహోట‌ల్‌లో ఉన్నందున ఆకుల‌ను క‌లిశారే త‌ప్ప‌...రామ్‌మాధ‌వ్‌తో భేటీ కాలేద‌ని చెప్తోంది. అయితే, త‌మ ద‌గ్గ‌ర ఉన్న పక్కా ఆధారాల‌తో టీడీపీ స్ప‌ష్టంగా బీజేపీ-వైసీపీల తీరును ఎండ‌గ‌డుతోంది. బుగ్గ‌న‌, ఆకుల స‌త్య‌నారాయ‌ణ సీసీటీవీ వీడియోల ద్వారా దొరికిపోయారని టీడీపీ అంటోంది. సీసీ కెమెరా ఫుటేజీల్లో దొరికిన ప‌రిణామాల వరకు ఒప్పుకొని దొరకని వాటిని ఒప్పుకోవట్లేదని అంటున్నారని..ఇక్క‌డే వైసీపీ బుక్క‌యిపోయింద‌ని అంటున్నారు.

రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం వెలుగులోకి వ‌చ్చిన వీడియోలో ఏపీ భవన్ కు వెళ్లినట్లుగా కారు లాగ్ రిజిష్టర్ లో కనబడిందని అంటున్నారు. లాగ్ రిజిష్టర్ లో మొదట ఏపీ భవన్ కు, అక్కడ నుంచి హోటల్ కు, అక్కడ నుంచి 27 సౌత్ ఎవెన్యూ ఇలా మూడు చోట్లకు వెళ్లినట్లుగా రికార్డులో రాసి ఉందని చెప్తున్నారు. ఈ ప్ర‌కారం తమ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అందుకోసం మూడు వెర్షన్లు చెబుతున్నారని టీడీపీ నేత‌లు అంటున్నారు. బీజేపీ నేత రామ్ మాధవ్ ఇంటికి వెళ్లిన విషయం బయటకు రాకుండా ఎందుకు చేశారో చెప్పాలని ప్ర‌శ్నించారు. వాహన లాగ్ రిజిష్టర్ లో బుగ్గన రాజేంద్రనాథ్ సంతకం పెట్టారని, తాను సంతకం పెట్టినప్పుడు 27 లేదు తర్వాత వేశారని చెప్పి వుంటే ఆయన చెప్పిన దానికి బలం ఉండేది – బీజేపీ నేతలు మాత్రం 27 అంకెను తర్వాత కలిపారని చెబుతున్నారని వ్యాఖ్యానిస్తోంది.

'వైసీపీ నేత‌ బుగ్గన రాజేంద్రనాథ్, ఆకుల సత్యనారాయణ మాత్రం సౌత్ ఎవెన్యూకి వెళ్లినట్లు మీడియా ముందు ఒప్పుకున్నారు. ఆకుల సత్యనారాయణను కారులో దింపడానికి వెళ్లానని బుగ్గన చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఆకుల తన కారు కోసం బుగ్గన కారు వెనక ఉన్నానని చెబుతున్నారు. ఇక్క‌డే ఆ పార్టీల మ‌ధ్య దోస్తీ స్ప‌ష్ట‌మ‌వుతోంది. ' అని తెలుగుదేశంనేత‌లు అంటున్నారు. చంద్రబాబు ప్రత్యర్థులను పిలుచుకొని త‌మ ప్రభుత్వంపైన, త‌మపైనా దాడి చేయాలనే ఉద్దేశంతో ఏపీ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి  వెళ్లుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఆకుల సత్యనారాయణ కలిసి చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పత్రాలను వైసీపీ నేతలకు ఇచ్చి చంద్రబాబును ఇరుకున పెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు వేరే వారికి ఇవ్వడం రాజ్యంగ విరుద్ధమ‌ని అంటున్నారు. ముసుగులు తొలగించి బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకున్నా త‌మకు అభ్యంతరం లేదని, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండ్ చేసిన వైసీపీ ఇప్పుడు వారితో లోపాయికారిగా కలుస్తోందని అంచ‌నా వేశామ‌ని టీడీపీ నేత‌లు చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు