రాహుల్ గాంధీ రాంగ్ స్టెప్స్

రాహుల్ గాంధీ రాంగ్ స్టెప్స్

2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌నీసం లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో పున‌రుజ్జీవం కోసం ఆప‌సోపాలు ప‌డుతుంది. తల్లిచాటు బిడ్డ‌గా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌రువాత అనేక ఎన్నిక‌ల‌కు నేతృత్వం వ‌హించి రాహుల్ గాంధీ ఐర‌న్ లెగ్ గా పేరుప‌డ్డాడు. తాజాగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించినా పెద్ద‌గా ప్ర‌భావం చూపిన దాఖ‌లాలు లేవు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో 78 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ (ప్ర‌స్తుతం గెలిచిన స్థానాల‌తో 80) పార్టీ 37 స్థానాలు గెలిచిన జేడీఎస్ కు మ‌ద్ద‌తు ఇచ్చి ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టాల్సి వ‌చ్చింది. బీజేపీ అధికారంలోకి రాకుండా నివారించ‌గ‌లిగాం అన్న సంతోషం త‌ప్పితే కాంగ్రెస్ కు ఇక్క‌డ ఒరిగింది ఏమీ లేదు. రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందీ లేదు. పైగా క‌ర్ణాట‌క నేత‌లు త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు రాలేద‌ని పార్టీ మీద ఆగ్ర‌హంగా ఉన్నారు.

ఇక 2019 ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న రాహుల్ గాంధీ మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ ఎన్నిక‌ల మీద దృష్టి పెట్టాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తిరుగుతున్న రాహుల్ ప్ర‌ధానంగా అధికారంలోకి వ‌చ్చిన ప‌దిరోజుల్లో రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ప్ర‌క‌టిస్తున్నారు. 2014 తెలంగాణ ప్ర‌చారంలో కూడా రాహుల్ గాంధీ ఈ రొండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ హామీ ఇచ్చినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. అయినా ఇప్ప‌టికీ దానినే ప‌ట్టుకుని వేలాడ‌డం గ‌మ‌నార్హం.

రిజ‌ర్వ్ బ్యాంక్ నిబంధన‌ల నేప‌థ్యంలో రుణ‌మాఫీ హామీలు ప్ర‌భుత్వాలు తీర్చ‌లేక‌పోతున్నాయి. తెలంగాణ‌లో ఈ ప‌థ‌కాన్ని నాలుగుద‌శ‌లలో కేసీఆర్ అమ‌లు చేసినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యాడు. తెలంగాణ‌లో రుణ‌మాఫీ విధానాన్ని ఆద‌ర్శంగా తీసుకుని కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన పంజాబ్ అధ్య‌య‌నం చేసి త‌మ రాష్ట్రంలో అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ఈ హామీకి ప్రాధాన్యం ఇస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

జాతీయ‌స్థాయిలో అధికారం ఆశిస్తున్న రాహుల్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే స్థాయి ప‌థ‌కాలు, వాటిని ఎలా అమ‌లు చేస్తాం అన్న‌దానిని ప్ర‌జ‌ల ముందుంచి ఆద‌రించాల‌ని కోరుకుంటే బాగుంటుంది. పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డిలా పాత‌హామీకె ప‌రిమిత కావ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ వంటి బ‌ల‌మైన పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కోవ‌డం పెద్ద చిక్కులాంటి స‌మ‌స్య‌. గ‌త నాలుగేళ్ల బీజేపీ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల ముందుంచి కాంగ్రెస్ దేశం కోసం అమ‌లు చేయ‌బోయే కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌తిపాదిస్తే ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉంటుంది. అలా కాకుండా ఇదే మూస ప‌ద్ద‌తిని అనుస‌రిస్తే రాహుల్ వి రాంగ్ స్టెప్స్ గానే మిగిలిపోతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు