అమెరికా, భార‌త్‌కు షాకిస్తూ..చైనా దూకుడు

అమెరికా, భార‌త్‌కు షాకిస్తూ..చైనా దూకుడు

అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు మ‌న‌దేశానికి షాకిస్తూ  చైనా దూసుకుపోతోంది. ప్రపంచంలో వ్యక్తిగత సంపద భారీగా పెరిగిపోతుండ‌గా...ఇందులో డ్రాగ‌న్ కంట్రీ త‌న ముద్ర‌ను వేసుకుంటోంది. 2016తో పోలిస్తే గత ఏడాది వ్యక్తిగత సంపద 12 శాతం పెరిగి 201.9 ట్రిలియన్ డాలర్లుకు(రూ.13,781 లక్షల కోట్లు) వృద్ధి చెందినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.. త‌న‌ నివేదికలో వెల్లడించింది. గత ఐదేండ్లుగా వార్షిక వృద్ధి బలంగా ఉండటం దీనికి కారణమని తెలిపింది. 2017లో బిలియనీర్ల సంఖ్య విషయంలో చైనా ప్రథమస్థానంలో నిలిచింది. బిలియనీర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానానికి ఆ దేశం ఎగబాకింది. వృద్ధి విషయంలో ఆసియా ఖండంలో చైనా దూసుకుపోతోంది. ఆ దేశంలో 2.5 లక్షల డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ఆస్తులు కలిగిన వారు భారీగా పెరిగారు. ఇదేస్థాయిలో సంపద వృద్ధి కొనసాగితే రానున్న ఐదేండ్లలో అమెరికాలో కంటే చైనాలోనే ఎక్కువగా సంపద సృష్టించబడుతుందని అంచనా వేశారు. అమెరికాతో పోలిస్తే చైనాలో నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో మిలియనీర్ల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈక్విటీ మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదు కావడంతో పెట్టుబడిదారులకు భారీగా లాభాలు రావడం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే వివిధ దేశాల కరెన్సీలు బలపడటంతో అమెరికాయేతర దేశాల పెట్టుబడిదారులకు మారకపు రేటు అదనంగా కలిసి వచ్చింది. దీంతో ప్రపంచంలో మిలియనీర్లు, బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత సంపదలో దాదాపు సగభాగం వీరిచేతుల్లోనే ఉండటం గమనార్హం. 2012లో దాదాపు 45 శాతం సంపద ఈ అపర కుబేరుల వద్దే ఉండగా ప్రస్తుతం అది మరింత పెరిగింది. మొత్తం వ్యక్తిగత సంపదలో 86.1 ట్రిలియన్ డాలర్ల (రూ.5,874 లక్షల కోట్లు)వ్యక్తిగత సంపద ఒక్క ఉత్తర అమెరికాలోనే ఉండటం విశేషం. మొత్తం వ్యక్తిగత సంపదలో మిలియనీర్లు, బిలియనీర్ల వద్ద ఉన్న సంపద శాతం పెరుగుతున్నదంటే పేదవారు ఇంకా పేదవారిగా మారిపోతున్నారని కాదని బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక ప్రధాన రచయిత అన్నా జాక్రజ్వెస్కీ పేర్కొన్నారు. వ్యక్తిగత సంపద పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ ధనికులుగా మారిపోతున్నారని.. అయితే ధనికులు ఇంకా వేగంగా కోటీశ్వరులు అవుతున్నారని తెలిపారు.

డాలర్ బలహీనపడిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే ప్రపంచ వ్యక్తిగత సంపదలో 7 శాతం పెరుగుదల చోటుచేసుకున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. నగదు విలువ పెరుగడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందిన ప్రాంతం పశ్చిమ యూరప్. అమెరికా డాలర్ బలహీనపడటాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ 15 శాతం సంపద వృద్ధి నమోదు కాగా స్థానిక కరెన్సీలో 3 శాతం వృద్ధి నమోదైంది. తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు కూడా సంపద విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. పెట్టుబడిపెట్టే మొత్తం ఆస్తుల్లో దాదాపు పావు వంతును ఈ దేశాలకు చెందిన బిలియనీర్లు కలిగి ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచిలోని తూర్పు యూరప్‌కు చెందిన 28 మంది రూ.20.05 లక్షల కోట్ల సంపదను కలిగి ఉండటం విశేషం. హాంకాంగ్ కూడా వ్యక్తిగత సంపద విషయంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English