అమెరికా దిగ్గ‌జ కంపెనీ కీల‌క స్థానంలో తెలుగ‌మ్మాయ్‌!

అమెరికా దిగ్గ‌జ కంపెనీ కీల‌క స్థానంలో తెలుగ‌మ్మాయ్‌!

తెలుగు వారు అత్యున్న‌త స్థానాలకు చేరుకోవ‌టం.. ఎంపిక కావ‌టం కొత్త విష‌య‌మేమీ కాదు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన కంపెనీల్లో కీల‌క ప‌ద‌వుల్ని చేప‌ట్టి త‌మ స‌త్తాను చాటిన వారు ఇప్ప‌టికే కొంద‌రున్నారు. తాజాగా అలాంటి విజ‌యాన్నే సాధించారు తెలుగ‌మ్మాయ్ ఒక‌రు.

అగ్ర‌రాజ్య‌మైన అమెరికాలో పురుషుల అధిక్య‌త ఎక్కువ‌గా ఉండే వాహ‌న‌రంగంలో దిగ్గ‌జ కంపెనీ అయిన జ‌న‌ర‌ల్ మోటార్స్ లాంటి కంపెనీకి సీఎఫ్ వో(చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌) గా ఎంపిక‌య్యారు 39 ఏళ్ల దివ్యా సూర్య‌దేవ‌ర‌.  తెలుగు మూలాలున్న వీరి కుటుంబం అప్పుడెప్పుడో చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యింది. అక్క‌డే పుట్టిన దివ్య చ‌దువంతా చెన్నైలో సాగింది. ఉన్న‌త విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఆమె.. చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే అత్యున్న‌త స్థానానికి చేరుకోవ‌టం విశేషం.

ప్ర‌పంచ వాహ‌న దిగ్గ‌జ సంస్థ‌ల్లో జ‌న‌ర‌ల్ మోటార్స్ ఒక‌టి. అలాంటి కంపెనీలో అత్యుత్త‌మ స్థాయికి చేరుకోవ‌టం అంత సామాన్య‌మైన విష‌యం కాదు. కంపెనీలో చేరిన ప‌ద‌మూడేళ్ల వ్య‌వ‌ధిలోనే కీల‌క ఉద్యోగి స్థాయికి చేరుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చిన్న‌త‌నం నుంచి చ‌ద‌వుంటే విప‌రీత‌మైన ఆస‌క్తి ఉన్న దివ్య‌.. సుప్ర‌సిద్ధ వ‌ర్సిటీ హార్వ‌ర్డ్ లో ఎంబీఏ చేసి.. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ యూబీఎస్ లో తొలుత ఉద్యోగంలో చేరారు. త‌ర్వాత జ‌న‌ర‌ల్ మోటార్స్ లో చేరారు. ఇర‌వై ఐదేళ్ల వ‌య‌సులో కంపెనీలో చేసిన ఆమె.. కేవ‌లం ప‌ద్నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో అత్యున్న‌త స్థానానికి చేరుకోవ‌టం గ‌మ‌నార్హం.

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే సంస్థ‌లో కీల‌క స్థానాల్లో బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించిన ఆమె త‌న స‌త్తాను చాటారు. కంపెనీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో దివ్య కీల‌కపాత్ర పోషించిన‌ట్లుగా చెబుతారు. సంస్థ‌కు చెందిన ఐరోపా అనుబంధ సంస్థ ఓపెల్‌ను అమ్మ‌టంలోనూ.. సెల్ఫ్ డ్రైవింగ్ కు సంబంధించిన స్టార్టప్ కంపెనీ క్రూజ్ కంపెనీ ప‌రం కావ‌టంలోనూ కీల‌క భూమిక పోషించిన‌ట్లుగా చెప్పాలి. జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూపు కార్పొరేష‌న్ నుంచి జీఎం క్రూజ్ లోకి ఏకంగా రూ.15వేల కోట్ల పెట్టుబ‌డుల్ని ఆక‌ర్షించ‌టంలో దివ్య కీ రోల్ ప్లే చేసిన‌ట్లుగా చెబుతారు. వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు వ‌స్తే.. దివ్య భ‌ర్త రాజ్ వ్యాపారి. ఉద్యోగం రీత్యా దివ్య డెట్రాయిట్ లో ఉంటూ వీకెండ్స్ లో న్యూయార్క్ లోని కుటుంబం వ‌ద్ద‌కు వెళుతుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు