తాజ్ మహల్ పై వీహెచ్పీ కార్య‌క‌ర్త‌ల వీరంగం!

తాజ్ మహల్ పై వీహెచ్పీ కార్య‌క‌ర్త‌ల వీరంగం!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన `తాజ్ మ‌హ‌ల్ `క‌ట్టడంపై కొంత‌కాలంగా బీజేపీ నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజ్ మ‌హ‌ల్ ను రామ్ మ‌హ‌ల్ గా మార్చాలంటూ ఉత్తర్ ప్రదేశ్ భైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపిన విష‌యం విదిత‌మే. ఆ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే తాజాగా తాజ్ పై మ‌రో వివాదం చెల‌రేగింది.

ప్ర‌తిష్టాత్మ‌క‌ తాజ్ మహల్ లోకి ప్ర‌వేశించేందుకు ఏర్పాటు చేసిన పశ్చిమ ద్వారాన్ని(ట‌ర్న్స్ టైల్ గేట్) వీహెచ్పీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పురాత‌న శివాలయంలోకి వెళ్లే దారిని ఆ గేటు మూసివేస్తోంద‌న్న ఆరోపణలతో వారు ఈ దాడికి పాల్ప‌డ్డారు. అయితే, ఆ ఆల‌యానికి వెళ్లేందుకు వేరే దారి ఉంద‌ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ ఐ)అధికారులు చెబుతోన్న‌ప్ప‌టికీ వీహెచ్ పీ కార్య‌క‌ర్త‌లు విన‌లేదు. దీంతో, ఆ విధ్వంసానికి పాల్ప‌డ్డ వీహెచ్ పీ కార్య‌క‌ర్త‌ల‌పై ఏఎస్ ఐ అధికారులు ఫిర్యాదు చేశారు.

తాజ్ మ‌హ‌ల్ ప‌శ్చిమ ద్వారానికి స‌మీపంలో ఉన్న బ‌న్సాయి ఘాట్ లో 400 ఏళ్ల నాటి పురాత‌న సిద్ధేశ్వ‌ర మ‌హ‌దేవ్ ఆల‌యం ఉంది. అయితే, తాజ్ మ‌హ‌ల్, స‌హేలీకా బుర్జ్ లో ప్ర‌వేశానికి గానూ కొత్త‌గా `ట‌ర్న్స్ టైల్ గేట్` టికెట్ కౌంట‌ర్ ను తాజ్ మ‌హ‌ల్ ప‌శ్చిమ ద్వారం వ‌ద్ద ఏఎస్ ఐ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, ఆ ఆల‌యానికి వెళ్లేదారికి ఆ గేటు అడ్డంగా ఉంద‌ని వీహెచ్పీ సభ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ఆ ఆలయానికి వెళ్లేందుకు మరో ప్ర‌త్యామ్నాయ మార్గం ఉందని పోలీసులు చెబుతున్నా వీహెచ్పీ కార్యకర్తలు పట్టించుకోలేదు.

దాదాపు 30 మంది వీహెచ్ పీ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. కొత్త‌గా ఏర్పాటు చేసిన ట‌ర్న్స్ టైల్ గేట్ ను తొలగించి 50 మీటర్ల దూరంలో విసిరివేశారు. అంతేకాకుండా, అక్కడ ఉన్న సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఏఎస్ ఐ అధికారుల ఫిర్యాదు ప్ర‌కారం పోలీసులు.....30 మంది వీహెచ్ పీ కార్య‌క‌ర్త‌ల‌పై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రినీ అరెస్టు చేయ‌లేదు.

ఈ దాడి ఘ‌ట‌న‌పై వీహెచ్ పీ బ్రిజ్ ప్రంత్ విశేష్ సంప‌ర్క్ ప్ర‌ముఖ్ ర‌వి దూబే స్పందించారు. 15 ఏళ్ల క్రితం తాజ్ ప‌శ్చిమ ద్వారం వ‌ద్ద ఉన్న‌ స‌హేలీకా బుర్జ్ లో `స‌త్సంగ్` జ‌రిగేద‌ని, క్ర‌మంగా ఏఎస్ ఐ అధికారులు దానిని నిలిపివేశార‌ని ర‌వి అన్నారు. అంతేకాకుండా, తాజ్ స‌మీపంలో ద‌స‌రా వేడుకల సంద‌ర్భంగా జ‌రిగే సంత‌ను నిర్వ‌హించ‌నీయ‌డం లేద‌ని, తాజ్ లో ఉన్న `ఆమ్ల` చెట్టు ద‌గ్గ‌ర ఆమ్ల న‌వ‌మి నాడు జ‌రిగే వేడుక‌ల‌ను ఏఎస్ ఐ అధికారులు అడ్డుకున్నార‌ని, దాంతోపాటు ఆ చెట్టును న‌రికి వేశార‌ని తెలిపారు.

ఇపుడు తాజాగా  కొత్త‌గా ఏర్పాటు చేసిన గేటు వ‌ల్ల సిద్ధేశ్వ‌ర మ‌హ‌దేవ్ ఆల‌యానికి వెళ్లే దారి మూసుకుపోయింద‌ని ర‌వి అన్నారు. అధికారులు చెబుతున్న ఆ మ‌రో దారి ఇరుకైన‌ద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై ఏఎస్ ఐ అధికారుల వాద‌న మ‌రోలా ఉంది. ఆ ఆల‌యానికి వెళ్లేందుకు మ‌రో దారి ఉంద‌ని, ఆ దారి గుండా ఆల‌యానికి వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేద‌ని చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా అధికారులు విచార‌ణ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English