మ‌హారాష్ట్రలో `ఫ‌డ్న‌వీజ్ అనే నేను`...

మ‌హారాష్ట్రలో `ఫ‌డ్న‌వీజ్ అనే నేను`...

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, ప్రిన్స్ మ‌హేష్ బాబుల కాంబోలో సామాజిక క‌థాంశంతో తెర‌కెక్కిన `భ‌ర‌త్ అనే నేను` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. సగ‌టు న‌గ‌ర జీవి ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్న తీరు....దానికి సీఎంగా భ‌ర‌త్ స్పందించిన విధానం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ట్రాఫిక్ రూల్స్ ను పాటించ‌ని వారిపై వేల రూపాయల ఫైన్ లు విధిస్తూ సీఎం భ‌ర‌త్ తీసుకున్న నిర్ణ‌యం ప‌లువురు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

నిజ జీవితంలో కూడా అదే త‌ర‌హాలో క‌ఠిన నిబంధ‌న‌లు విధిస్తే బాగుండు అని సినిమా చూసిన ప్రేక్ష‌కులు  అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, వారు అనుకున్న‌ట్లుగా ఆ త‌ర‌హా క‌ఠిన నిబంధ‌న‌లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విధించ‌లేదుగానీ.....భ‌రత్ అనే నేను నుంచి మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీజ్ మాత్రం స్ఫూర్తి పొందిన‌ట్లున్నారు. మ‌హారాష్ట్ర‌లో ప్లాస్టిక్ బ్యాగుల వాడ‌కం పై నిషేధం విధించిన నేప‌థ్యంలో...ఆ బ్యాగులు వాడితే రూ.10 వేలు జ‌రిమానా విధిస్తూ మ‌హారాష్ట్ర `భ‌ర‌త్`....సీఎం ఫ‌డ్న‌వీజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ముంబైలోని బీచ్ తో పాటు తీర ప్రాంతాల‌లో ప్లాస్టిక్ బ్యాగుల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త దెబ్బ‌తింటోంది. దానికి తోడు ఆ ప్లాస్టిక్ బ్యాగులు స‌ముద్రంలో చేరి స‌ముద్ర జీవులు మృత్యువాత ప‌డుతున్నాయి. దీంతో, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకొని మ‌హారాష్ట్ర‌లో ప్లాస్టిక్ బ్యాగుల వాడ‌కాన్ని ఈ ఏడాది మార్చి 23 నుంచి నిషేధించారు. అయితే, పేప‌ర్ బ్యాగులు, దుస్తుల‌తో చేసిన ప‌ర్యావ‌ర‌ణ స‌హిత బ్యాగుల‌కు పౌరులు అల‌వాటుప‌డేందుకు 3 నెల‌లు గ‌డువిచ్చారు. ఆ గ‌డువు జూన్ 23 నుంచి ముగియ‌నుంది. దీంతో, జూన్ 23 నుంచి ప్లాస్టిక్ బ్యాగులు అమ్మినా, కొన్నా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. ఈ నేప‌థ్యంలో జూన్ 23 నుంచి ప్లాస్టిక్ బ్యాగులు వినియోగించే వారిపై రూ.10 వేలు ఫైన్ విధిస్తామ‌ని బృహ‌ణ్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎమ్ సీ)ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా సీఎం భ‌ర‌త్ లా మారిన ఫ‌డ్న‌వీజ్ పై సోషల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఫ‌డ్న‌వీజ్ ను మిగ‌తా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కామెంట్స్ పెడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు