బీజేపీ అహంకారం చ‌ల్ల‌బ‌డిన‌ట్లుందే!

బీజేపీ అహంకారం చ‌ల్ల‌బ‌డిన‌ట్లుందే!

ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై ప్ర‌ధాని మోదీ, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాతో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. రాహుల్ ను మొద్ద‌బ్బాయిలా చిత్రీకరించి.....ప్ర‌ధాని ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తి కాద‌ని....వార‌స‌త్వ రాజ‌కీయాల వ‌ల్లే రాహుల్ ఈ స్థాయికి ఎదిగార‌ని ఎద్దేవా చేస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో రాహుల్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, ఆయ‌న ధ‌రించిన జాకెట్ ధ‌ర వంటి వ్య‌క్తిగ‌త విష‌యాలనూ బీజేపీ నేత‌లు టార్గెట్ చేశారు.

'కాంగ్రెస్ ముఖ్త్ భారత్` అని ....దేశం నుంచి ఆ పార్టీని త‌రిమికొడితేనే దేశం బాగుప‌డుతుంద‌నే ధోర‌ణిలో ప్ర‌చారం చేశారు. అయితే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు...త‌ద‌నంత‌ర ప‌రిణామాల వ‌ల్ల‌నో....దేశ‌వ్యాప్తంగా బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌న్న టాక్ కార‌ణంగానో హఠాత్తుగా ఆ స్లోగ‌న్ కు ఉన్న అర్థాన్ని మార్చేశారు.

ఆ ప‌దానికి అమిత్ షా స‌రికొత్త అర్థాన్నిస్తూ....ప్ర‌తిప‌క్ష పార్టీని కొద్దిగా గౌరవించే ప‌నిలో ప‌డ్డారు.  'కాంగ్రెస్ ముఖ్త్ భారత్` అంటే....దేశం నుంచి కాంగ్రెస్ ను వెళ్లగొట్టాలి అని కాదని, ఆ పార్టీ సంస్కృతిని పోగొట్టాలని అర్థమని స‌వివ‌రంగా చెప్పారు. చత్తీస్ ఘడ్ లోని సుర్గుజా జిల్లాలో మీడియాతో మాట్లాడిన షా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అంతేకాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందని షా అన్నారు. ఆ స్లోగ‌న్ కు త‌ప్పుడు అర్థం తీసుకోవ‌ద్ద‌ని చెప్పారు. దేశంలో దారుణంగా త‌యారైన కాంగ్రెస్ పరిస్థితిని రాహుల్ బతికించుకోవాలని సూచించారు. బీజేపీ జాతీయాధ్య‌క్షుడిగా త‌న పార్టీ ప్ర‌తిష్ట కాపాడాల్సిన బాధ్య‌త త‌నపై ఉంద‌ని, అదే త‌ర‌హాలో కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడిగా రాహుల్ పై ఆ బాధ్య‌త ఉంద‌ని అన్నారు. తామిద్ద‌రం ఉన్న ప‌ద‌వుల కార‌ణంగా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు త‌ప్ప‌వ‌ని అన్నారు. కాంగ్రెస్ లో వారసత్వం గురించి రాహుల్.... బీజేపీలో వారసత్వం గురించి తాను చెబుతానన్నారు.

తన వ్యాఖ్యలను రాహుల్ వ్య‌క్తిగతంగా తీసుకోకూడ‌ద‌న్నారు. త‌న‌కు రాహుల్ వేసిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చెప్పానని అన్నారు. తాము చేస్తోన్న మంచి పనులను చూసి బీజేపీకి ప్రజలు జేజేలు కొడుతున్నార‌ని, 14 రాష్ట్రాల్లోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టార‌ని గుర్తు చేశారు. నాలుగేళ్లలో భారీ సంఖ్యలో తీవ్రవాదులను మ‌ట్టుబెట్టామ‌ని చెప్పారు. మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలకు వెళ్తే ఎవరికీ తెలియ‌ద‌ని, మోదీ వెళితే ఎన్నారైలతో పాటు ఆయా దేశ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

అయితే, హ‌ఠాత్తుగా రాహుల్ పై షా...వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి. క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో పాటు ఆ తర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో బీజేపీకి ప్ర‌తికూల ప‌వ‌నాలు వీయ‌డంతో షా దూకుడు త‌గ్గించారు. ఇప్ప‌టివ‌ర‌కు తామే మోనార్కులం అన్న బీజేపీ అహంకారం....ఆ ఫ‌లితాల‌తో కొద్దిగా దిగిన‌ట్లు క‌నిపిస్తోంది. మొన్న‌టి మొన్న కర్ణాట‌క‌లో య‌డ్డీకి అధికారం క‌ట్ట‌బెట్టేందుకు అడ్డదారులు తొక్కి .....ప్ర‌తిప‌క్షాన్ని తుడిచిపెట్టాల‌ని కుటిల రాజ‌కీయాలు చేసిన షా...స‌డెన్ గా యూట‌ర్న్ తీసుకోవ‌డం శోచ‌నీయం. ఈ త‌ర‌హా నీచ రాజ‌కీయాల‌ను, కాంగ్రెస్ పై విష ప్ర‌చారాల‌ను చూసిన దేశ ప్ర‌జ‌లు.....బీజేపీకి దూర‌మ‌వుతున్నార‌ని గ‌మ‌నించిన షా ఈ ర‌కంగా మాట్లాడి ఉండ‌వ‌చ్చు. ఏదేమైనా.....తాజా ప‌రిణామాల‌తో బీజేపీ అధిష్టానం అహంకారం కొద్దిగా త‌గ్గింద‌ని చెప్ప‌వ‌చ్చు.