అర్థ‌రాత్రి వేళ‌.. ఢిల్లీ సీఎం షాకింగ్ నిర్ణ‌యం

అర్థ‌రాత్రి వేళ‌.. ఢిల్లీ సీఎం షాకింగ్ నిర్ణ‌యం

కొద్దికాలంగా వార్త‌ల్లో పెద్ద‌గా క‌నిపించ‌కుండా పూర్తిగా పాల‌న మీద దృష్టి సారించిన‌ట్లుగా క‌నిపిస్తున్నారు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌. సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచి.. దేశంలో రోటీన్ కు భిన్న‌మైన రాజ‌కీయాల్ని చూపిస్తానంటూ పాలిటిక్స్ లోకి వ‌చ్చిన ఆయ‌న‌.. త‌న ముద్ర‌ను కొంత‌మేర వేయ‌గ‌లిగారు. జాతీయ పార్టీల‌కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన ఆమ్ ఆద్మీ సీఎం.. తాజాగా అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకొని సంచ‌ల‌నం సృష్టించారు.

సోమ‌వారం అర్థ‌రాత్రి వేళ ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఇంటి ముందు ముఖ్య‌మంత్రి చేప‌ట్టిన‌ మెరుపు ధ‌ర్నా సంచ‌ల‌నంగా మారింది.  సుమారు అరు గంట‌ల పాటు లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ తో మాట్లాడేందుకు ఆయ‌న వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసినా.. ఆయ‌న‌తో మాట్లాడే అవ‌కాశం ల‌భించ‌క‌పోవ‌టంతో అక్క‌డే ఉన్న సోఫాలో కాళ్లు చాచి నిద్ర పోయారు.

ఎందుకిదంతా చేశారంటే కాస్త వెన‌క్కి వెళ్లాలి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌కు భిన్న‌మైన రాష్ట్రంగా ఢిల్లీని చెప్పాలి. గ‌తంలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని త‌ర్వాతి కాలంలో రాష్ట్రంగా మార్చారు. అయితే.. ప‌రిమిత‌మైన అధికారులు మాత్ర‌మే ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారుకు ఉంటాయి. ఎందుకంటే.. కేంద్రం అక్క‌డే కొలువు తీరి ఉండ‌టంతో.. రాష్ట్ర స‌ర్కారుకు నామ‌మాత్ర అధికారాలు ఉంటాయి. పాల‌న‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు ఏమీ ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉండ‌వు.

కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప‌వ‌ర్లో ఉంటే ఇబ్బందులు ఉండ‌వు. అలా కాకుండా.. నిప్పు.. ఉప్పు మాదిరి ఇప్పుడున్న ప్ర‌భుత్వాల‌తోనే అస‌లు చిక్కంతా. ఢిల్లీ కోట‌లో ఎలాగైనా త‌మ జెండా పాతాల‌ని బీజేపీ త‌పిస్తుంటే.. మ‌రోవైపు బీజేపీ అధిక్యాన్ని స‌వాల్ చేసి మ‌రీ షాకివ్వాల‌ని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ త‌పిస్తోంది. దీంతో.. వీరి మ‌ధ్య పాల‌న కంటే పోరే అధికంగా ఉన్న ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌.. ఢిల్లీ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చాల‌న్న డిమాండ్‌ను చేస్తున్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ చేసిన ఆయ‌న‌.. ఒక‌వేళ ఢిల్లీని కానీ పూర్తి రాష్ట్రంగా ప్ర‌క‌టిస్తే.. తాను 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తాన‌ని కేజ్రీవాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఓవైపు ఢిల్లీని రాష్ట్రంగా ప్ర‌కటించాల‌న్న డిమాండ్ చేస్తూనే..మ‌రోవైపు అనూహ్యంగా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ నివాసం ద‌గ్గ‌ర మెరుపు ధ‌ర్నా చేసి సంచ‌ల‌నం సృష్టించారు.

మెరుపు ధ‌ర్నాకు కాస్త ముందుగా త‌న నివాసంలో మీడియాతో మాట్లాడిన ముఖ్య‌మంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ స‌ర్కారును సాగ‌నివ్వ‌కుండా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం.. కేంద్రం అడ్డుకుంటున్నాయ‌న్నారు. సీబీఐ.. ఈడీ..ఆదాయ‌ప‌న్ను.. అవినీతి నిరోధ‌క శాఖల్ని త‌మ మంత్రుల‌పైకి ఉసిగొల్పుతున్నాయ‌న్నారు.

త‌మ మంత్రుల‌పై 14 కేసులు ఉన్నాయ‌ని.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు.. వారి బంధువుల‌పై రోజుకో కేసును న‌మోదు చేస్తున్న‌ట్లుగా చెప్పారు. కేసులు న‌మోదు చేస్తున్న పోలీసులు.. అభియోగాలు నిరూపించ‌టానికి.. అరెస్ట్ లు చేయ‌టానికి కానీ ఆస‌క్తి చూప‌క‌పోవ‌టానికి కార‌ణం ఏమిటి? అంటూ కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు.

కేంద్రం తీరును నిర‌సిస్తూ.. లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ ఇంటి ముందు నిర‌స‌న‌ను చేప‌ట్ట‌టం ద్వారా సంచ‌ల‌నానికి తెర తీసిన కేజ్రీవాల్ కు త‌గ్గ‌ట్లే.. లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్ కూడా మొండిగా సీఎంను క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం నాట‌కీ ప‌రిణామాలు మ‌రిన్ని చోటు చేసుకున్నాయి.

మీరు మొండి అయితే తాను జ‌గ‌మొండిన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన సీఎం కేజ్రీవాల్ లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ ఇంటి వెయిటింగ్ హాల్లో నిద్ర పోవ‌టం ద్వారా.. కావాల్సినంత సానుభూతిని సంపాదించుకున్నార‌ని చెప్పాలి. సోఫాలో కాకుండా.. నేల మీద సామాన్యుడిలా నిద్రించి ఉంటే.. వ్య‌వ‌హారం మ‌రింత ర‌క్తి క‌ట్టి ఉండేది క‌దూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు