ట్రంప్...కిమ్ భేటీ..భార‌తీయ వంట‌కాలు అదుర్స్‌

ట్రంప్...కిమ్ భేటీ..భార‌తీయ వంట‌కాలు అదుర్స్‌

నిన్న మొన్నటిదాకా కత్తులు దూసుకున్నారు.. ఒకరి దేశాన్ని ఒకరు నాశనం చేస్తామని ప్రకటనలు చేశారు. అమెరికాలోని ప్రధాన నగరాలకు చేరగల క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షిస్తే.. ఒక్క మీటతో ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ మాటలు, చర్యలతో ప్రపంచ దేశాలను దాదాపు వణికించారు. ఒకరికొకరు పరస్పరం దూషణలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అణ్వస్త్ర పరీక్షలు జరిపినందుకు ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక ఆంక్షల కొరడా ఝుళిపించింది. కానీ నాటకీయ ఫక్కీలో ట్రంప్, కిమ్‌లు శాంతి నినాదం అందుకున్నారు. కిమ్‌తో భేటీ కావడానికి తాను సిద్ధమేనని ప్రకటించడ‌మే కాకుండా స‌మావేశం అయి ప్రపంచ దేశాలను ట్రంప్ ఆశ్చర్యానికి గురి చేశారు.

అయితే ట్రంప్-కిమ్ మధ్య జరిగే చారిత్రక శిఖరాగ్ర సమావేశంలో భార‌తీయ‌త‌కు పెద్ద‌పీట ద‌క్కింది. ఈ స‌మావేశాన్ని కవర్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 3,000 మంది జర్నలిస్టులకు వడ్డించేందుకు సిద్ధమవుతున్న వంటకాల్లో పులావ్, చికెన్ కుర్మా, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, దాల్, పాపడ్ లాంటి భారతీయ వంటకాలు ఉన్నాయి. ట్రంప్, కిమ్ సమావేశాన్ని కవర్ చేసేందుకు సిద్ధమైన స్థానిక, విదేశీ జర్నలిస్టులకు ఆహార కొరత లేకుండా చూసేందుకు 15 హోటళ్లలో 45 రకాల వంటకాలను తయారు చేశారు. వీటిలో భారత్‌తో పాటు సింగపూర్, మలేషియా, వియత్నాం, థాయిలాండ్, కొరియా, జపా న్, చైనా, ఫ్రాన్స్, అమెరికన్, ఇటాలియన్, ఇంగ్లీష్, వంటకాలతో మెనూ సిద్ధమయింది.

ఇదిలాఉండ‌గా.... ట్రంప్, కిమ్ భేటీని ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయి. రెండు అణ్వాయుధ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న ఆసక్తి అన్ని దేశాల్లోనూ ఉంది. ట్రంప్, కిమ్ ఇవాళ సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్‌లో భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలో ప్రపంచ మీడియా ఆ దృశ్యాలను లైవ్ చేసింది. చర్చల పట్ల ఉత్సుకతో ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్ దేశాలు ఆ మీటింగ్‌ను లైవ్‌లో ఫాలో అయ్యాయి. కానీ అసలైన నార్త్ కొరియా మాత్రం ఆ ఈవెంట్‌ను లైవ్‌లో చూడలేదు. తమ దేశాధ్యక్షుడు కిమ్ .. అగ్రదేశాధినేత ట్రంప్‌తో భేటీ అవుతుంటే.. ఆ దేశ టీవీ మాత్రం ఆ ఫూటేజ్‌ను లైవ్ చేయలేదు. వివిధ దేశాలకు చెందిన టీవీ స్క్రీన్ షాట్లను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. సాధారణంగా ఉత్తర కొరియా అధికారిక టీవీ ఉదయం ఆరు గంటలకే ప్రారంభం అవుతుంది. కానీ ఆ టీవీ తమ నేత గురించి లైవ్ ఇవ్వలేదు. కేవలం బులిటెన్‌లో మాత్రమే ఆ దృశ్యాలను లైవ్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక దక్షిణ కొరియాలో కిమ్ జాంగ్ ఇప్పుడు టాప్ సెర్చ్‌గా మారారు. కింగ్ జాంగ్ వయసు ఎంత అన్న కోణంలోనూ దక్షిణ కొరియా ప్రజలు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే కూడా ట్రంప్, కిమ్ చరిత్రాత్మక భేటీని లైవ్‌లో చూశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు