ట్రంప్‌, కిమ్...45 నిమిషాల ఏకాంతం

ట్రంప్‌, కిమ్...45 నిమిషాల ఏకాంతం

ఉత్కంఠకు తెర‌ప‌డి ఉత్తరకొరియా అధినేత కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శిఖరాగ్ర చర్చలు మ‌రికొన్ని గంట‌ల్లో మొద‌లుకానుంది. మంగళవారం ఉదయం 9 గంటల (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటల)కు వారి శిఖరాగ్ర భేటీ ప్రారంభం కానుంది. వీరిద్ద‌రి భేటీ కోసం సింగపూర్‌కు చెందిన సెంటోసా ద్వీపంలోని కాపెల్లా హోటల్ ముస్తాబయింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ రేపు సుమారు 45 నిమిషాల పాటు ఏకాంతంగా చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య మీటింగ్ స‌మ‌యంలో కేవ‌లం ట్రాన్స్‌లేట‌ర్లు మాత్ర‌మే ఉంటారు.

సెంటోసా దీవిలోని కాపెల్లా హోట‌ల్‌లో సింగ‌పూర్ కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 9.15 నిమిషాలు స‌మావేశం ఉంటుంద‌ని వైట్‌హౌజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఆ త‌ర్వాత 10 గంట‌ల‌కు ద్వైపాక్షిక చ‌ర్చ‌లు ఉంటాయి. 11.30 గంట‌ల‌కు వ‌ర్కింగ్ లంచ్ ఉంటుంది. సాయంత్రం 4 గంట‌ల‌కు మీడియా స‌మావేశంలో ట్రంప్ మాట్లాడుతారు. కాపెల్లా హోట‌ల్ నుంచి సాయంత్రం 6.30 నిమిషాల‌కు ట్రంప్ ప‌య‌న‌మ‌వుతారు. కిమ్, ట్రంప్ మధ్య జరుగనున్న సమావేశం విజయవంతం కావాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు.

కిమ్‌తో సమావేశమయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(జూన్-10) సాయంత్రం కెనడా నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. అంతకుముందే ఉత్తరకొరియా రాజధాని ప్యాం గ్యాంగ్ నుంచి ఎయిర్‌చైనా విమానంలో సింగపూర్‌కు చేరుకున్న కిమ్‌కు ఘన స్వాగతం లభించింది. ట్రంప్, కిమ్‌లకు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్వాగతం పలికారు. పటిష్ట భద్రత మధ్య కిమ్‌ను ఆయన బస చేసే సెయింట్‌రెగిస్ హోటల్‌కు తీసుకువెళ్లారు. అయితే ఇవాళ కిమ్ సింగ‌పూర్‌లో టూర్ చేశారు. అక్క‌డ ఆయ‌న గార్డెన్ బే, మ‌రినా బే ప్ర‌దేశాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కిమ్ దిగిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.