క్రికెట్ దేవుడితో డ్యాషింగ్ ఓపెనర్ ఫొటో...వైర‌ల్!

క్రికెట్ దేవుడితో డ్యాషింగ్ ఓపెనర్ ఫొటో...వైర‌ల్!

లెజెండ‌రీ క్రికెట‌ర్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ .....టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ల జోడీ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దో ప్ర‌త్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రూ ఓపెన‌ర్లుగా బరిలోకి దిగితే ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాల్సిందే. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో వీరూ విరుచుకుప‌డితే.....చూడ‌చ‌క్క‌ని సొగ‌సైన షాట్ల‌తో బంతిని స‌చిన్ బౌండ‌రీకి త‌ర‌లిస్తాడు. ఈ విధ్వంస‌క‌ర సొగ‌స‌రి జోడీ త‌మ భాగ‌స్వామ్యాల‌తో ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది. అయితే, ఈ జోడీ మైదానంలోనే కాకుండా మైదానం వెలుప‌ల కూడా ఆ భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగిస్తూనే ఉంది. ఆట‌కు గుడ్ బై చెప్పిన త‌ర్వాత కూడా ఈ ఇద్దరు మాజీ ఆట‌గాళ్లూ త‌మ అనుబంధాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు. త‌న‌కు స‌చిన్ అంటే విప‌రీత‌మైన అభిమాన‌మ‌ని, భ‌క్తి అని సెహ్వాగ్ ఇప్పటికే ప‌లుమార్లు వెల్ల‌డించాడు. తాజాగా, స‌చిన్ ను శ్రీ‌రాముడితో....త‌న‌ను హ‌నుమంతుడితో పోలుస్తూ వీరూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.


ట్విట్ట‌ర్, ఇన్ స్టాగ్ర‌మ్ ల‌లో వీరూ చాలా యాక్టివ్ గా ఉంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే. తనదైన శైలిలో జోకులు, సెటైర్లు వేస్తూ....అభిమానుల‌ను వీరూ అల‌రిస్తుంటాడు. తాజాగా ఓ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా స‌చిన్ తో క‌లిసి ఉన్న ఓ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీరూ పోస్ట్ చేశాడు. సచిన్‌ రాముడైతే.. తాను హనుమంతుడిని అన్న త‌ర‌హాలో గ‌ద‌ను మోస్తున్న త‌ర‌హాలో స‌చిన్ ముందు మోక‌రిల్లిన‌ ఓ ఫొటోను వీరూ షేర్‌ చేశాడు. ‘దేవుడితో ఉన్నప్పుడు..అతని పాదాల వద్ద ఉండటం బాగుంది` అని ఆఫొటోకు క్యాప్ష‌న్ కూడా పెట్టాడు. ఆ ఫొటోపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మీ ఇద్ద‌రిదీ ఎప్ప‌టికీ అద్భుతమైన జోడీ అంటూ కామెంట్లు  చేస్తున్నారు. మీ మొబైల్ లో స‌చిన్ కాంటాక్ట్ నేమ్ `గాడ్‌జీ` అని సేవ్‌ చేసుకున్నారా.....అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. మైదానం వెలుప‌ల‌...లోప‌ల‌....ఎక్క‌డైనా స‌చిన్ కు వీరూ వీర విధేయుడేన‌ని మరొక‌రు కామెంట్ పెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు