స‌ర్కారు ఆర్డ‌ర్ఃమీ సంపాద‌న‌లో మూడోవంతు ఇచ్చేయండి

స‌ర్కారు ఆర్డ‌ర్ఃమీ సంపాద‌న‌లో మూడోవంతు ఇచ్చేయండి

బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో మ‌రో వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. సంక్షేమానికి పెద్ద పీట వేయాల్సిన స‌ర్కారు తీసుకున్న షాకింగ్ నిర్ణ‌యం కార‌ణంగా..ఆ రాష్ట్రంలోని ప‌లు వ‌ర్గాలు అవాక్క‌వుతున్నాయి. `మీ సంపాద‌న‌లో మూడోవంతు ఇచ్చేయండి` అంటూ ప్ర‌భుత్వం ఆర్డ‌ర్ వేసింది. ఇలా ఆర్డ‌ర్ వేసింది అథ్లెట్ల‌కు కావ‌డంతో... ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనన్న ఆదేశాలపై అథ్లెట్లు మండిపడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అథ్లెట్లు ప్రొఫెషనల్ స్పోర్ట్స్, కమర్షియల్ ఎండార్స్‌మెంట్స్‌లలో పాల్గొనే సమయంలో అంగీకరించాల్సిన నిబంధనలు అంటూ ఈ కొత్త ఆదేశాల‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్‌, క‌మర్షియ‌ల్ ఎండార్స్‌మెంట్‌ల‌లో పాల్గొనే సమయంలో సదరు అథ్లెట్‌కు అసాధారణ సెలవు (జీతం లేకుండా) ఇస్తారు. అయితే ఆ అథ్లెట్ వాటి ద్వారా సంపాదించిన మొత్తంలో మూడో వంతును హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తాం అని ఏప్రిల్ 30న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఉంది. ఒకవేళ ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవుపై వెళ్లి ఈవెంట్ లేదా వాణిజ్య ప్రకటనల షూటింగ్‌లో పాల్గొంటే వాటి ద్వారా వచ్చే సంపాదన మొత్తాన్నీ స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సిందేనని కొత్త నిబంధన పెట్టారు. ఈ ప్ర‌తిపాద‌న వివాదాస్ప‌దం అయింది.

హ‌ర్యాన స‌ర్కారు నిర్ణ‌యంపై అథ్లెట్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రెజ్లర్ బబితా ఫొగాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. `అసలు ఓ అథ్లెట్ ఎంతగా శ్రమిస్తారో ప్రభుత్వానికి తెలుసా? సంపాదనలో మూడో వంతు ఇవ్వాలని వాళ్లు ఎలా అడుగుతారు? దీనిని అస్సలు సమర్థించను. ప్రభుత్వం దీనిపై ముందుగానే మాతో చర్చించాల్సింది` అని బబితా సీరియస్ అయింది.ఈ డబ్బును రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఉపయోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు