గ్రీన్ కార్డుల కోసం మ‌నోళ్ల క‌ళ్లు కాయ‌లు

గ్రీన్ కార్డుల కోసం మ‌నోళ్ల క‌ళ్లు కాయ‌లు

అమెరికాలోని భార‌తీయ నిపుణుల‌కు ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా అనూహ్య‌మైన ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి. అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు)ను పొందేందుకు ఎదురుచూస్తున్న వృత్తినిపుణుల్లో నాలుగింట మూడు వంతుల మంది భారతీయులే ఉన్నారు. యూఎస్‌సీఐఎస్ (యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అమెరికాలో గత నెలాఖరు నాటికి ఉపాధి ఆధారిత ప్రాధాన్య క్యాటగిరీలో మొత్తం 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, వీరిలో భారతీయులే 3,06,601 మంది ఉన్నారని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా 67,031 మందితో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక మిగిలిన ఏ దేశానికి చెందిన వారు కూడా 10 వేల మందికి మించి లేరని యూఎస్‌సీఐఎస్ వివరించింది.

అమెరికాలో ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో జారీచేసే మొత్తం గ్రీన్‌కార్డుల్లో ఏ దేశానికి చెందిన వారికైనా 7 శాతం కంటే ఎక్కువ మంజూరు చేయడానికి వీల్లేదు. దీని వలన భారతీయులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల‌ తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత వృత్తినిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వస్తున్నారు. అయితే 7 శాతం పరిమితి నిబంధన వలన అమెరికాలో శాశ్వత నివాస హోదాను పొందేందుకు భారతీయులు సుదీర్ఘ కాలం పాటు (25 నుంచి 92 ఏళ్ల‌ వరకూ) నిరీక్షించాల్సి వస్తోంది.

కాగా, ఒక దేశానికి ఏడు శాతం గ్రీన్‌ కార్డులు మాత్రమే జారీ చేయాలనే నిబంధన వల్ల భారతీయులు శాశ్వత నివాసం కోసం కొన్నేళ్ల‌ పాటు ఎదురుచూడాల్సి వస్తుందనీ... ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందని యూఎస్‌కు చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల‌ తరబడి ఎదురుచూస్తున్న విధానంలో మార్పులు చేయాల్సిందిగా కోరుతూ పలువురు భారతీయులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. జీసీరిఫామ్స్‌. ఓఆర్‌జీ ఇచ్చిన సమాచారం మేరకు భారతీయులు సుమారు 25 నుంచి 92 ఏళ్ల‌ పాటు గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. దీని వల్ల అక్కడ నివసిస్తున్న భారతీయుల పిల్లల భవిష్యత్‌ ఇబ్బందుల్లో పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు