నేను చేసిన త‌ప్పేంటో అర్థం కావ‌డం లేదు:ర‌జ‌నీకాంత్

  నేను చేసిన త‌ప్పేంటో అర్థం కావ‌డం లేదు:ర‌జ‌నీకాంత్

కావేరీ జ‌ల వివాదంపై క‌ర్ణాట‌క‌కు వ్య‌తిరేకంగా ర‌జ‌నీ వ్యాఖ్య‌లు చేశారంటూ....క‌ర్ణాట‌క‌లో `కాలా` చిత్రం విడుద‌ల‌పై క‌ర్ణాట‌క ఫిల్మ్ చాంబర్ నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. త‌మ చిత్రాన్ని విడుద‌ల చేసేలా చూడాల‌ని నిర్మాత ధ‌నుష్ కోర్టును ఆశ్ర‌యించారు. ఆ పిటిష‌న్ ను విచార‌ణ చేసిన కోర్టు....కాలా చిత్రాన్ని నిషేధించటం సరికాదని స్పష్టం చేసింది. కాలాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టి వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.

అయితే, తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ కర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో కాలాను విడుద‌ల చేస్తే వివాదాలు ఏర్ప‌డ‌తాయ‌ని సీఎం కుమార స్వామి అభిప్రాయ‌పడ్డారు. దీంతో, త‌న చిత్రాన్ని విడుద‌ల‌య్యేలా చూడాలంటూ కుమారస్వామికి రజనీకాంత్ వ్య‌క్తిగ‌తంగా మెసేజ్ కూడా పెట్టారు. అయిన‌ప్ప‌టికీ కుమార స్వామి నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా, ఆ వివాదంపై ర‌జ‌నీ మ‌రోసారి స్పందించారు.

తాను క‌ర్ణాట‌క‌కు వ్య‌తిరేకంగా ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని, సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం....కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తాను కోరాన‌ని అన్నారు. ఆ విష‌యం మిన‌హాయించి కర్ణాటక ప్రభుత్వంపై తాను ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని ర‌జనీ అన్నారు. తాను అన్నదాంట్లో త‌ప్పేమిటో త‌ను అర్థం కాలేద‌ని అన్నారు. కన్నడిగుల ప్రయోజనాలను దెబ్బతినేలా తాను ఎన్న‌డూ ఆలోచించ‌లేద‌ని ర‌జ‌నీ చెప్పారు.

త‌న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంద‌ని, కర్ణాటకలో నిలిపివేయడం స‌రికాద‌ని అన్నారు. కర్ణాట‌క‌లో `కాలా` ప్రశాంతంగా విడుదలయ్యేలా కుమార‌స్వామి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. క‌ర్ణాట‌క‌లో సినిమా చూడాలనుకునేవారిని అడ్డుకోవద్దని కన్నడ సంఘాలకు విజ్ఞ‌ప్తి చేశారు. త‌లైవా తాజా విజ్ఞ‌ప్తిపై క‌న్న‌డ సంఘాలు, సీఎం కుమార స్వామి ఏ విధంగా స్పందిస్తారో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English