వర్మకు విజయేంద్ర ప్రసాద్ కౌంటర్

తొలి సినిమా ‘శివ’తోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని, కొన్నేళ్లలోనే ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు రామ్ గోపాల్ వర్మ. ‘శివ’ తర్వాత రంగీలా, క్షణక్షణం, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి చిత్రాలతో ఆయన రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇలాంటి దర్శకుడు ఇప్పుడున్న స్థితికి ఆశ్చర్యపోతున్నారు. జాలిపడుతున్నారు. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయనపై పూర్తిగా ఆశలు కోల్పోయి పట్టించుకోవడం మానేశారు.

ఐతే వర్మ మీద ఇంకా అభిమానం చంపుకోలేని వాళ్లు మాత్రం.. ఆయన మళ్లీ పుంజుకుని ఒకప్పట్లా సినిమాలు తీస్తే చూడాలని ఆశిస్తున్నారు. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సైతం వర్మ పట్ల ఇలాంటి అభిమానమే ప్రదర్శిస్తూ.. ఆయన ప్రస్తుత స్థితి పట్ల ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్ తప్పిన వర్మ మీద ఒక సినిమా వేడుకలో ఆయన కౌంటర్లు కూడా వేశారు. ఒకప్పటి వర్మను చూడాలనుందన్న తన కోరికనూ బయటపెట్టారు.

‘కనబడుటలేదు’ అనే సినిమా వేడుకకు వర్మతో పాటు విజయేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై విజయేంద్ర మాట్లాడుతూ.. 1989లో సినిమా మీద ప్యాషన్‌తో వచ్చి.. ఎవరి దగ్గరా పని చేయకుండానే కేవలం సినిమా మీద ప్రేమతో ‘శివ’ అనే చిత్రం తీసి సంచలనం సృష్టించి.. అప్పటి కుర్రాళ్లందరూ సైకిల్ ఛైన్లు పట్టుకుని తిరిగేలా చేసిన దర్శకుడు ఇప్పుడు కనిపించడం లేదన్నారు.

రంగీలా, సత్య, కంపెనీ లాంటి అద్భుతమైన సినిమాలు తీసి ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేసి వందల మంది దర్శకులుగా మారడానికి కారణమైన డైరెక్టర్ ఇప్పుడు కనిపించడం లేదన్నారు. శ్రీదేవిని ఇంకెవరూ చూపించనంత అందంగా చూపించి.. ఆమెతో జామురాతిరి జాబిలమ్మ లాంటి పాట పాడించిన దర్శకుడు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఆ దర్శకుడిని మళ్లీ చూడాలనుందని.. ఆయన కనిపిస్తే బాగుంటుందని వర్మ మీద కౌంటర్లు వేశారు విజయేంద్ర.

దీనికి కిందున్న వర్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. తర్వాత వేదిక మీదికి వచ్చినపుడు విజయేంద్ర కామెంట్ల మీద వర్మ ఏమీ స్పందించలేదు. టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ విజయేంద్ర గడ్డం మీద చర్చ పెట్టాడు. ఆయన మోడీని చూసి గడ్డం పెంచుతున్నాడా.. రవీంద్రనాథ్ ఠాగూర్‌ను చూసి పెంచుతున్నారా.. లేక తన కొడుకైన రాజమౌళే అంత గడ్డం పెంచితే నేనెంత పెంచాలన్న ఉద్దేశంతో ఇలా పెంచుతున్నారా అని సందేహంగా ఉందన్న వర్మ రామాయణం రాసిన వాల్మీకి కంటే గొప్పదైన బాహుబలి కథను రాసినందుకు ఆయన్ని మించి గడ్డం పెంచాలన్న ఉద్దేశంతో ఇలా పెంచుతుండొచ్చని.. ఇదే కరెక్ట్ అయ్యుండొచ్చని వ్యాఖ్యానించాడు.