వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం వెనుక అసలు రహస్యం ఇదీ

వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం వెనుక అసలు రహస్యం ఇదీ

ఏపీలో టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాక వైసీపీకి దగ్గరైన బీజేపీకి వైసీపీ అధినేత జగన్ భారీ గిఫ్ట్ ఇచ్చారా.. అదేంటి..? తమ పార్టీ ఎంపీల రాజీనామాల ఆమోదంతో మోదీకి మేలు చేశారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదెలాగో చదవండి.    
  
లోక్‌సభలో నామినేటెడ్ సభ్యులను ఇద్దరిని మినహాయిస్తే సభ పూర్తి బలం 543. అంటే ఎన్నికైన సభ్యులు 543 మంది ఉంటారన్నమాట. ఆ లెక్కన ఏదైనా పార్టీ లేదా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ ఉండాలంటే ఆ సంఖ్య 272 అవుతుంది. ఇప్పుడు బీజేపీకి సొంతంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సరిగ్గా అంతే ఉంది. కానీ.. బుధవారం ఉదయం వరకు ఉన్న లెక్క ప్రకారం లోక్‌సభలో ఎన్నికైన సభ్యులు 539 మంది ఉన్నారు. మొన్న నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన ఎంపీలతో కలిపి ఈ లెక్క. ప్రస్తుతం దేశంలో నాలుగు పార్లమెంటు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్, కర్ణాటకలోని బళ్లారి, మాండ్యా, షిమోగా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి పోగా ఉన్న 539 స్థానాలకే లెక్కేసినా కూడా 270 మంది బలం ఉండాలి.

అంటే... బీజేపీకి సొంతంగా ఉన్న బలం ఈ మ్యాజిక్ మార్కు కంటే జస్ట్ రెండు మాత్రమే ఎక్కువ. అయితే.. ప్రభుత్వం నడిపిస్తున్న ఎన్డీయే కూటమి లెక్క అయితే ప్రస్తుతం315 మంది ఉన్నారు. ఆ రకంగా ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నట్లే. కానీ... ఇటీవల ప్రాంతీయ పార్టీల ఆలోచనాతీరు మారుతుండడం..ప్రత్యామ్నాయ కూటములు తెరపైకి వస్తుండడం బీజేపీలో కొంత ఆందోళన పెంచుతోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ తెగతెంపులు చేసుకుంది. శివసేన వంటి చిరకాల మిత్రుడు కూడా దూరమైన పరిస్థితి. పైగా ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ స్థానాలను కూడా బీజేపీ కోల్పోతోంది.


వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ ఆత్మవిశ్వాసం తగ్గుతోంది. దీంతో పార్టీ శ్రేణులు, నేతలు అందరిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు... సభలో సొంతబలం బొటాబొటి కాకుండా కాస్త ఎక్కువ ఉండేలా బీజేపీ కోరుకుంటోంది. ఆ క్రమంలోనే వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోందించినట్లు అర్థమవుతోంది.

అయిదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించాక సభలో మొత్తం ఎంపీలు 534 మందే ఉంటారు. అంటే... 268 మ్యాజిక్ ఫిగర్.. బీజేపీ సొంతబలం దానికంటే 4 ఎక్కువ ఉన్నట్లవుతుంది. ఈ సమీకరణాలతోనే వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన వైసీపీ అధినేత జగన్ తన ఎంపీలతో రాజీనామాలు చేయించి మోదీ నెత్తిన పాలుపోశారనే అనుకోవాలి. మోదీ 56 ఇంచీల ఛాతీని కాస్త ఉప్పొంగేలా జగన్ తన ఎంపీలను బలిపశువును చేసినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు