ఫేస్ బుక్ పాడుబుద్ధిని బ‌య‌ట‌పెట్టిన న్యూయార్క్ టైమ్స్

ఫేస్ బుక్ పాడుబుద్ధిని బ‌య‌ట‌పెట్టిన న్యూయార్క్ టైమ్స్

ఫేస్ బుక్ సుద్ద‌పూస కాద‌న్న విష‌యం మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న ద‌గ్గ‌ర ఉన్న డేటాను ప‌లు కంపెనీల‌కు షేర్ చేస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డింది. ఆ మ‌ధ్య‌న కేంబ్రిడ్జి అన‌లిటికా ఇష్యూలో ఫేస్ బుక్ ఇమేజ్ డ్యామేజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్పట్లో త‌మ త‌ప్పేం లేద‌ని.. న‌మ్మి మోస‌పోయిన‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చింది.

స‌ద‌రు ఉదంతంపై జుక‌ర్ బ‌ర్గ్ సైతం స్పందించి.. ఇక‌పై ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌న్న హామీని ఇచ్చారు. అయితే.. ఆయ్య‌గారివ‌న్నీ మాట‌లే త‌ప్పించి చేత‌లు కావ‌న్న వైనం బ‌య‌ట‌ప‌డింది. కేంబ్రిడ్జ్ అన‌లిటికా విష‌యంలో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా కంటితుడుపు చ‌ర్య‌ల మాట‌ల్ని జుక‌ర్ బ‌ర్గ్ చెప్పి త‌ప్పించుకున్నారా? అన్న డౌట్ వ‌చ్చేలా తాజా ప‌రిణామం ఉంది.

త‌న వినియోగ‌దారుల స‌మాచారాన్ని కొన్ని దిగ్గ‌జ కంపెనీల‌తో పంచుకుంటున్న వైనాన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ వెల్ల‌డించింది. ఫేస్ బుక్ త‌న యూజ‌ర్ల డేటాను యాపిల్‌.. అమెజాన్.. మైక్రోసాఫ్ట్.. శాంసంగ్‌.. బ్లాక్ బెర్రీ లాంటి 60 కంపెనీల‌కు అందిస్తుంద‌న్న వైనాన్ని బ‌య‌ట‌పెట్టింది.

ఈ పాడుబుద్ధి ఏదో ఒక‌టి.. రెండేళ్ల నుంచి కాద‌ని దాదాపుగా ప‌దేళ్ల నుంచి ఇలాంటి తీరునే క‌లిగి ఉంద‌న్న షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. త‌మ వినియోగ‌దారుల‌తో పాటు.. వారి స్నేహితుల స‌మాచారాన్ని సేక‌రించేందుకు వీలు క‌ల్పించిన‌ట్లుగా చెప్పింది. అయితే.. ఈ అంశాన్ని ఫేస్ బుక్ స‌మ‌ర్థించుకుంది. ఎఫ్ టీసీ.. ప్రైవ‌సీ పాల‌సీల‌కు అనుగుణంగానే త‌మ ఒప్పందం ఉంద‌ని చెప్పింది. ఫేస్ బుక్ వివ‌ర‌ణ‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పైకి చాటింగ్‌.. త‌మ‌కు తెలిసిన విష‌యాల్ని.. త‌మ విష‌యాల్ని షేరింగ్ చేసుకునే వెసులుబాటుతో పాటు.. కోట్లాది మంది వ్య‌క్తిగ‌త జీవితాల్లో భాగ‌మైన ఫేస్ బుక్ తీరు తెలిసిన వారంతా తాజా వైనంతో అవాక్కు అవుతున్న ప‌రిస్థితి. ఫేస్ బుక్ మీదున్న భ్ర‌మ‌ల్ని తొల‌గించేలా తాజా ఉదంతం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. సో.. ఫేస్ బుక్ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి. మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం ప‌దుల సంఖ్య‌లో కంపెనీల‌కు షేర్ అవుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English