ఎందుకు స్వామీ... ఆ వెంక‌న్న‌తో పెట్టుకుంటావు

ఎందుకు స్వామీ... ఆ వెంక‌న్న‌తో పెట్టుకుంటావు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వివాదం మలుపులు తిరుగుతోంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే తీవ్ర చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డుస్తుండ‌గా తాజాగా కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా విధుల నుంచి తొలగిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని ప్ర‌క‌టించిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నంత ప‌నిచేశారు.

తమిళనాడు చిదంబరం నటజరాజ దేవాలయంపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ నుంచి 2014లో సుప్రీం ఆదేశాలతో విముక్తి లభించిందని పేర్కొన్న స్వామి ఆ తీర్పు ఆధారంగా టీటీడీపై ప్రభుత్వ అజమాయిషీని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరతానని చెప్పిన‌ట్లే...తాజాగా ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టారు.

టీటీడీ వివాదంపై పిటిషన్ వేస్తానని ప్ర‌క‌టించిన స్వామి కోర్టులో దాఖలు నిమిత్తం వ్యాజ్యం తయారు చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చెన్నైలో న్యాయవాదులు మోహన్‌దాస్‌, టీఆర్‌ రమేష్‌, ఆర్ రవిలతో సమావేశమైన చిత్రాన్ని కూడా పోస్టు చేశారు. టీటీడీ నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణను కోరనున్నారు. రమణ దీక్షితులను టీటీడీ బోర్డు తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, బోర్డు నిర్ణయాన్ని కొట్టివేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకు వెళ్తామని ప్రకటించిన స్వామి ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. టీటీడీ బోర్డు ఆలయ నిధుల దుర్వినియోగంపై సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనున్నట్టు తెలపడం, ఇప్పుడు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి టీటీడీని విముక్తి చేయాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసేందుకు సిద్ధమవడం గమనార్హం.

అయితే, గ‌తంలో ప‌లువురు ప్ర‌ముఖులు టీటీడీ సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోవ‌డం, అనంత‌రం వారు వివాదాల్లో చిక్కుకోవ‌డం తెలిసిన సంగ‌తే. అలాంటి ఉదంతాల నేప‌థ్యంలో స్వామి టీటీడీ అంశంపై ఇంత దూకుడుగా స్పందించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇంతేకాకుండా బీజేపీకి చెందిన ఎంపీ రాష్ట్ర ప‌రిధిలో ఉన్న టీటీడీ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయంగా మారింది. ప్ర‌భుత్వ ఆధిప‌త్యం తొల‌గాల‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి కోరుతుండ‌గా ...కేంద్రం టీటీడీపై క‌న్నేసింద‌ని భ‌క్తులు ఆరోపిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు