కోమ‌టిరెడ్డి విష‌యంలో కేసీఆర్‌కు షాక్‌

కోమ‌టిరెడ్డి విష‌యంలో కేసీఆర్‌కు షాక్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మ‌రోమారు కోర్టు రూపంలో అనూహ్య‌మైన షాక్ త‌గిలింది. గవర్నర్ ప్రసంగం సమయంలో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించి పదవులు పొగొట్టుకున్న కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ విష‌యంలో కాంగ్రెస్ నేత‌ల వాద‌నే నెగ్గింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.  హైకోర్టు తీర్పు నేపథ్యంలో కోమటిరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఈ ప‌రిణామం అధికార పార్టీకి మింగుడుప‌డ‌నిద‌ని అంటున్నారు.

ఎమ్మెల్యేల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ స‌స్పెన్ష‌న్ వేటు వేసిన‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. అయితే, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోమటి రెడ్డి, సంపత్ హైకోర్టును ఆశ్ర‌యించారు.  ప్రొసీడింగ్ ప్రాపర్ గా జరగలేదని ,సభ్యుల వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రధ్ధు, సస్పెండ్ చేయడం రూల్స్ కు విరుద్ధం అని పిటిషన్లో వివ‌రించారు. ఎథిక్స్, ప్రివలైజ్ కమిటీల అభిప్రాయం తీసుకోకుండానే ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. సభ్యత్వం రధ్దు, సస్పెన్షన్ ల వెనక రాజకీయ దురుద్దేశం ఉందని కోర్టుకు తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాల‌ని హైకోర్టును  కోరారు. ఈ వాద‌న‌పై హైకోర్టు ఏకీభ‌వించి తీర్పు ఇచ్చి వారిని ఎమ్మెల్యేలుగా కొన‌సాగించాల‌ని తెలిపింది. దీంతో ఈ నిర్ణ‌యంపై టీఆర్ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్ర‌యించి వారి స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసింది. అయితే, సింగిల్‌బెంచ్ తీర్పును స‌మ‌ర్థిస్తూ కోమ‌టిరెడ్డి, సంప‌త్‌ను ఎమ్మెల్యేలుగా కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేసింది.

రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావడం చాలా అరుదైన విషయం. ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీలోనూ ఒక ద‌శ‌లో విబేధాలు పొడ‌చూపాయి. గాంధీభవన్ లో నలభై ఎనిమిది గంటల దీక్ష ముగిసిన తర్వాత కోమటిరెడ్డి, సంపత్ వ్యవహారం చల్లబడింది. కోర్టు చూసుకుంటుందిలే అన్నట్లుగా కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ అంశానికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కాగా, తమను అన్యాయంగా పదవుల నుంచి తొలగించారని వాపోతున్నా పార్టీ పెద్ద‌లు ప‌ట్టించుకోలేదని కోమ‌టిరెడ్డి ఒక ద‌శ‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, కోమ‌టిరెడ్డి అసంతృప్తిని సీఎల్పీ నేత‌ జానారెడ్డి లైట్ తీసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు