మీడియా ముందుకు వ‌చ్చేందుకు మోడీకి వ‌ణుకు

మీడియా ముందుకు వ‌చ్చేందుకు మోడీకి వ‌ణుకు

ఇంగ్లిష్‌ మీడియా జ‌ర్న‌లిస్ట్‌ల‌లోని సుప్ర‌సిద్ధుల్లో ఒక‌రు, సునిశిత‌ విమ‌ర్శ‌కుల్లో పెట్టింది పేర‌యిన ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ 53వ ఆవిర్భావ దినోత్సవంతోపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్‌దీప్ ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొదలుకొని పలువురు ముఖ్యమంత్రుల వరకు దేశంలో ఎంతోమంది నాయకులు మీడియా ముందుకు వచ్చేందుకు జంకుతున్నారని ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. జర్నలిస్టుల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకనే వారంతా మీడియాకు దూరంగా ఉంటున్నారని  విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మిగ‌తా వారికంటే భిన్న‌మైన వ్య‌క్తి అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

'మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా' అనే థీమ్‌తో సాగిన చ‌ర్చాగోష్టిలో రాజ్‌దీప్ మాట్లాడుతూ ప్రస్తుతం జాతి, మతంలాంటి అంశాల గురించి పట్టించుకున్నంతగా దేశాభివృద్ధిని గురించి మీడియా పట్టించుకోవడంలేదని, దేశానికి ఎంతోముఖ్యమైన వ్యవసాయం, విద్య, వైద్యం, సాంకేతిపరిజ్ఞానం వంటి అంశాలను విస్మరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు సైతం రాజకీయపార్టీల వారీగా విడిపోయి గ్రూపులుగా ఏర్పడటం దారుణమని రాజ్ దీప్ అన్నారు. సోషల్ మీడియా రాకతో ప్రతిఒక్కరూ జర్నలిస్టులుగా మారిపోయి అసత్యవార్తలతో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని  ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో దేశ సమగ్రతను కాపాడటం జర్నలిస్టులకు పెద్ద సవాల్‌గా మారిందని రాజ్‌దీప్ అభిప్రాయపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వల్ల టీవీ చానళ్లు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని, వాటితో పోల్చితే పత్రికలకే ఎక్కువ విశ్వాసం ఉందని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు