ఆప‌రేష‌న్ గ‌రుడ నిజ‌మే అనిపిస్తుంది- చంద్ర‌బాబు

ఆప‌రేష‌న్ గ‌రుడ నిజ‌మే అనిపిస్తుంది- చంద్ర‌బాబు

కొంత‌కాలం క్రితం న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు శివాజీ ప్ర‌ధాని మోడీ ద‌క్షిణాదిపై ఎలా దండ‌యాత్ర చేయ‌బోతున్నాడో వీడియో స‌హితంగా వివ‌రించ‌డం వైర‌ల్ అయ్యింది. దానిని కొంద‌రు కొట్టి పారేశారు. కానీ, క్ర‌మంగా అత‌ను చెప్పిన‌ట్లే కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉండ‌టంతో ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌-గ‌రుడ ఈ రెండూ నిజ‌మేన‌ని జ‌నాలు న‌మ్మ‌డం మొద‌లుపెట్టారు. క‌ర్ణాట‌కలో అధికారం చేప‌ట్టే ప్ర‌య‌త్నం కూడా అందులోని భాగ‌మే. అయితే, అక్క‌డ గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. స‌రిగ్గా ఏపీలో కూడా శివాజీ వివ‌రించిన ప్లాన్ లో చెప్పిన‌ట్టే చాలా సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.

తాజాగా దీనిపై ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా అనుమాన‌ప‌డ్డారు. *చూస్తుంటే  రాష్ట్రంలో ఆప‌రేష‌న్ గ‌రుడ జ‌రుగుతున్నట్లే అనిపిస్తోంద‌ని, బీజేపీతో టీడీపీ విభేదించిన తర్వాత‌ నుంచే తమపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని* చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జ‌రుగుతున్న‌పుడు రెండు మూడు నెల‌లు ఆ ప్రాసెస్ కొన‌సాగితే ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఒక్కమాట కూడా మాట్లాడ‌లేదు. అలాంటి ప‌వ‌న్ ఇపుడు ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్ర‌బాబు విమర్శించారు.  చిన్న స‌మ‌స్య‌పై భారీగా స్పందిస్తున్న ప‌వ‌న్‌ బీజేపీ ఏపీ మొత్తాన్ని గాలికి వ‌దిలేస్తే ఒక్కసారి కూడా గ‌ట్టిగా స్పందించడం లేదన్నారు.  చివరకు తిరుమలను కూడా ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నించిందని, కుద‌ర‌క‌పోయేస‌రికి ఆరోప‌ణ‌లు చేయిస్తోంద‌న్నారు. మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారణాసికి, తిరుమలకు ఏమాత్రం పోలిక లేదని, తిరుమల ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని బాబు అన్నారు.  

బీజేపీ త‌న అధికారం కోసం మ‌నుషులను విడ‌గొట్టే క్రూర రాజ‌కీయం చేస్తోంది, ఏపీని అస్థిరపరిచే చ‌ర్య‌లు అమ‌లు చేస్తోంద‌ని బాబు ఆరోపించారు. రాయలసీమ డిక్లరేషన్ తో బీజేపీ, ఉత్త‌రాంధ్ర‌-మూడు ముక్క‌ల మాట‌ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడ‌టం చిచ్చుపెట్టే రాజ‌కీయాల‌కు ఉదాహ‌ర‌ణ అన్నారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుట్ర రాజకీయాలను ఏపీలో సాగనివ్వబోమని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు